డబ్ల్యూహెచ్‌ఓకి అమెరికా నిధులు కట్‌

16 Apr, 2020 04:46 IST|Sakshi

ఇది సమయం కాదన్న ఐరాస

వాషింగ్టన్‌: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారిపై అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విఫలమైందని ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నంత పని చేశారు. డబ్ల్యూహెచ్‌ఓకి నిధుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతీ ఏడాది అమెరికా 50 కోట్ల డాలర్ల నిధుల్ని డబ్ల్యూహెచ్‌ఓకి కేటాయిస్తుంది. ఆ సంస్థ చైనాకి కొమ్ముకాస్తూ ప్రపంచదేశాలను ముప్పులో పడేసిందని ట్రంప్‌ ఆరోపించారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థకి విడుదల చేసే నిధుల్ని వెంటనే ఆపేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నాను’ అని ట్రంప్‌ వెల్లడించారు. ‘వూహాన్‌లో వైరాలజీ ల్యాబ్‌ ఉంది.

అక్కడే మాంసం, చేపల మార్కెట్లు ఉన్నాయి. వైరస్‌ అక్కడే పుట్టింది’ అని  అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. కోవిడ్‌ సంక్షోభంలో చిక్కుకొని ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి వచ్చే నిధుల్ని నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌పై పోరాటంలో చురుకైన పాత్ర పోషిస్తున్న డబ్ల్యూహెచ్‌ఓకి ఇలాంటి సమయంలో నిధుల్ని ఆపేయడం సరైంది కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరాస్‌ అన్నారు.   ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల్ని ఆపేస్తే దాని ప్రభావం అందరి మీద  పడుతుందన్నారు. ప్రపంచదేశాలన్నీ ఐక్యమత్యంగా ఉంటూ రాబోయే విపత్తును ఎదుర్కోవాల్సిన తరుణంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అన్నారు.

నిధులు పెంచుతాం : చైనా
ప్రపంచ ఆరోగ్య సంస్థకి అమెరికా నిధుల్ని నిలిపివేయడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో  నిధుల్ని ఆపేస్తే, ఆ దేశంతో సహా అందరిపైనా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. తాము ఇకపై నిధులు పెంచుతామంటూ సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే 2 కోట్ల  డాలర్లు ఇచ్చామని వెల్లడించింది.

మరిన్ని వార్తలు