ఫైర్‌ చాలెంజ్‌ పూర్తి చేస్తానంటూ..

22 Aug, 2018 13:55 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తిమియా

మిచిగాన్‌ : ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలెంజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఫిట్‌నెస్‌‌, గ్రీన్‌, కేరళ డొనేషన్‌ చాలెంజ్‌ వంటి ఉపయోగకరమైన చాలెంజ్‌లతో పాటు... కీకీ వంటి ప్రమాదకరమైన చాలెంజ్‌లు కూడా ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరుగున పడిన ఫైర్‌ చాలెంజ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలను చూసిన ఓ బాలిక ప్రాణాల మీదకి తెచ్చుకుంది. వైరల్‌గా మారిన చాలెంజ్‌ను స్వీకరిస్తానంటూ ఒంటికి నిప్పంటించుకుంది. ఈ ఘటన మిచిగాన్‌లో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. మిచిగాన్‌కు చెందిన తిమియా ల్యాండర్స్‌(12) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే స్నేహితురాలితో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో ఫైర్‌ చాలెంజ్‌ గురించి తెలుసుకుంది. తాను కూడా ఈ చాలెంజ్‌ పూర్తి చేస్తానంటూ ఒంటిపై ఆల్కహాల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో బాధను భరించలేక గట్టిగా కేకలు వేసింది. తిమియా అరుపులు విన్న ఆమె తల్లి వెంటనే పరుగెత్తుకు వచ్చి మంటలు ఆర్పి, ఆమెను ఆస్పత్రిలో చేర్చింది. అయితే 50 శాతం ఒళ్లు కాలిపోవడంతో ఆమెకు సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఈ విషయం గురించి తిమియా తల్లి మాట్లాడుతూ... ‘పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి ప్రమాదకరమైన వీడియోల వల్ల నాలాగా ఏ తల్లిదండ్రులు బాధ పడకూడదు. యూట్యూబ్‌లో ఉన్న ఈ వీడియోలను వెంటనే తొలగించాలి. లేనిపక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతాన’ని హెచ్చరించారు. కాగా ఇటువంటి వీడియోలను తాము ఎంత మాత్రం సహించబోమని, వాటిని వెంటనే తొలగిస్తామని యూట్యూబ్‌ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

ఏమిటీ ఫైర్‌ చాలెంజ్‌..
2012లో ప్రారంభమైన ఫైర్‌ చాలెంజ్‌ అమెరికాలో బాగా ఫేమస్‌ అయ్యింది. ఫైర్‌ చాలెంజ్‌ను స్వీకరించిన వారు ఒంటిపై ఆల్కహాల్‌ పోసుకొని నిప్పంటించుకోవాలి. ఆ తర్వాత వెంటనే బాత్‌టబ్‌ వద్దకు పరిగెత్తి మంటలను ఆర్పేసుకోవాలి. ఈ తతంగాన్నంతా వీడియో తీసి మరొకరికి చాలెంజ్‌ విసరాలి. కాగా ఇటువంటి పిచ్చి చాలెంజ్‌ల బారిన పడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని పోలీసు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు