యుద్ధ హెలికాఫ్టర్లు వచ్చేస్తున్నాయ్‌..

13 Jun, 2018 08:40 IST|Sakshi
అపాచీ హెలికాఫ్టర్ల విక్రయానికి అమెరికా గ్రీన్‌సిగ్నల్‌

వాషింగ్టన్‌ : భారత్‌కు ఆరు బోయింగ్‌ ఏహెచ్‌-64ఈ అపాచీ హెలికాఫ్టర్లను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. భారత్‌ వినతి మేరకు యుద్ధ విమానాల విక్రయ ప్రతిపాదన భారత్‌-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేస్తాయని అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. దక్షిణాసియాలో రాజకీయ స్థిరతం, శాంతి, ఆర్థిక పురోగతికి కీలకంగా వ్యవహరించే తమ కీలక భాగస్వామి (భారత్‌) భద్రతను మెరుగుపరిచే చర్యగా దీన్ని అభివర్ణించింది.

ప్రతిపాదిత అపాచీ హెలికాఫ్టర్ల విక్రయం దక్షిణాసియాలో సైనిక సమతూకంలో ఎలాంటి మార్పులూ చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది. ఉపరితలంపై ఎదురయ్యే సవాళ్లను యుద్ధ హెలికాఫ్టర్లు సమర్థంగా ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. అపాచీని బోయింగ్‌ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ టాటా భాగస్వామ్యంతో హెలికాఫ్టర్లను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తుంది.

యుద్ధ హెలికాఫ్టర్లతో పాటు నాలుగు ఏఎన్‌\ఏపీజీ -78 ఫైర్‌ కంట్రోల్‌ రాడార్లు, హెల్‌ఫైర్‌ లాంగ్‌బో మిసైల్స్‌, స్టింగ్‌ బ్లాక్‌ మిసైల్స్‌, జీపీఎస్‌ ఇంటీరియల్‌ నావిగేషన్‌ సిస్టమ్‌లు, శిక్షణ పరికరాలనూ భారత్‌కు విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ 5000 కోట్లుపైగా ఉంటుందని అంచనా.

>
మరిన్ని వార్తలు