గర్భిణులు ఒలింపిక్స్‌కు వెళ్లొద్దు!

27 Feb, 2016 10:46 IST|Sakshi

ఈ ఏడు జరిగే ఒలింపిక్స్‌కు గర్భిణులు వెళ్లకపోవడం మంచిదని అమెరికా ప్రభుత్వం సలహా ఇస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈసారి బ్రెజిల్‌లో జరిగే ఒలింపిక్స్‌కు జికా వైరస్ ప్రమాదం పొంచి ఉందని, దీంతో గర్భిణిలు ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లరాదని సూచిస్తోంది. పుట్టబోయే పిల్లలకు జికా వైరస్ వల్ల ఎటువంటి నష్టం కలగకూడదన్న అభిప్రాయంతోనే ఈ ప్రత్యేక సూచన చేస్తున్నట్లు సీడీసీ తెలిపింది.

2016లో తప్పనిసరిగా ఒలింపిక్స్‌కు వెళ్లాలనుకున్న గర్భిణిలు మాత్రం ముందుగా తమ డాక్లర్లు, లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్ల సలహాలు, సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని సీడీసీ ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది. ముఖ్యంగా జికా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచిస్తోంది  గర్భిణులు మాత్రమే కాదు, వారి భర్తలు ఒలింపిక్స్‌కు వెళ్లినా జికా ప్రమాదం ఉంటుందని సీడీసీ చెప్తోంది.  అందుకే అలా వెళ్లాలనుకునే వారు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లి వచ్చిన భర్తతో సెక్స్ విషయంలోనూ గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని,  లేందంటే పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గర్భిణిగా ఉన్నంతకాలం సెక్స్ దూరంగా ఉండటం మంచిదని హెచ్చరిస్తోంది.

ముఖ్యంగా బ్రెజిల్‌లో జికా వ్యాప్తి గణనీయంగా ఉండటంతో సీడీసీ ఈ ప్రత్యేక సిఫార్సులు చేసింది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని సీడీసీ వెల్లడించింది. దోమల వల్ల కలిగే జికా వైరస్ బ్రెజిల్‌లో వ్యాప్తి చెందుతున్నట్లు గత సంవత్సరంలో బ్రెజిలియన్ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఇటువంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు సీడీసీ చెబుతోంది. గర్భిణులకు జికా వైరస్ సోకితే పుట్టబోయే పిల్లల పెరుగుదలలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీడీసీ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా చిన్న తలతో పుట్టడం, శారీరక ఎదుగుదల లోపించడం, వినికిడి శక్తిలోపం వంటి అసాధారణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు  జీవితానికే ప్రమాదం కావచ్చని చెబుతోంది.

మరిన్ని వార్తలు