పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన​ అమెరికా

26 Mar, 2018 20:49 IST|Sakshi

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు అమెరికా గట్టి షాక్‌ ఇచ్చింది. న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌( ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం కోసం ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. అణుసంబంధిత వ్యాపారం చేసే ఏడు సంస్థలపై అమెరికా నిషేదం విధించడంతో ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం పొందాలనే పాక్‌ ఆశలు అడియాశలయ్యాయి. పాక్‌కు చెందిన ఈ సంస్థలు అణు సంబంధిత వ్యాపారం చేస్తూ అమెరికా​కు నష్టం చేకూరుస్తాయనే నెపంతో నిషేదం విధించింది.

ఉగ్ర కార్యకలాపాలపై నిఘా ఉంచే ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి. భారత్‌తో సమానంగా ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కావాలని పాక్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్‌కు ఈ విషయంలో అనేక దేశాల మద్దతు లభించింది. అలాగే క్షిపణి పరిఙ్ఞానం, వాసేనర్ ఒప్పందం, ఆస్ట్రేలియా గ్రూప్‌లో ఇప్పటికే భారత్‌కు సభ్యత్వం ఉంది. సాధారణంగా ఈ సభ్యత్వాలను ఎన్‌ఎస్జీకి ఎంట్రీగా భావిస్తారు.

ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలకు పాక్ సహాయపడిందనే వార్తలు రావడంతో ఎన్‌ఎస్‌జీలో చేరాలని భావిస్తోన్న పాకిస్తాన్ ఆకాంక్ష వెనుక సదుద్దేశం లేదని అమెరికా గ్రహించింది. తమ జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపట్టే ఆస్కారం ఉందని బలంగా నమ్ముతూ ఈ ఏడు పాకిస్థాన్ సంస్థలపై నిషేధం విధించామని యూఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ పేర్కొంది. ఈ జాబితాలో మొత్తం 23 సంస్థలను చేర్చినట్టు తెలిపింది. అయితే పాకిస్తాన్‌‌పై ఒత్తిడి తీసుకురావడానికే అమెరికా ఈ నిర్ణయాలు తీసుకుంటుందని పాకిస్తాన్‌కి చెందిన ఓ పత్రిక పేర్కొంది.

మరిన్ని వార్తలు