ఆల్‌- ఖైదా యెమెన్‌ చీఫ్‌ హతం: ట్రంప్‌

7 Feb, 2020 08:53 IST|Sakshi

కాల్పుల ఘటనకు బదులు తీర్చుకున్న అగ్రరాజ్యం!

వాషింగ్టన్‌: ఉగ్రవాద సంస్థ ఆల్‌- ఖైదా యెమెన్‌ చీఫ్‌ ఖాసీం ఆల్‌- రిమీని హతమార్చినట్లు అమెరికా తెలిపింది. తమ దేశ నావికా దళ అధికారులను బలి తీసుకున్నందుకు గానూ అతడిని మట్టుబెట్టినట్లు పేర్కొంది. యెమెన్‌లో హింసకు కారణమైన అత్యంత ప్రమాదకర వ్యక్తిని అంతమొందించినట్లు వెల్లడించింది. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా ఆల్‌- ఖైదా ఇన్‌​ అరేబియన్‌ పెనిసులా(ఏక్యూఏపీ) కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్‌ నిర్వహించామని తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరిట శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది.

యెమన్‌లో హింసకు పాల్పడి.. ఇక్కడ కూడా
‘‘రిమీ నేతృత్వంలో ఏక్యూఏపీ యెమెన్‌లో తీవ్ర హింస చెలరేగింది. ఎంతో మంది పౌరులను బలిగొన్నారు. ఇప్పుడు అమెరికా పౌరులు, అమెరికా బలగాలపై దాడులు చేసేందుకు ఆ సంస్థ ప్రణాళికలు రచించింది. అందుకే ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా యెమెన్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఖాసీం ఆల్‌- రిమీని అంతమొందించాం. అతడి చావుతో ఏక్యూఏపీ, ఆల్‌- ఖైదా ఉద్యమం నీరుగారిపోతుంది. ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల మా జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా గతేడాది డిసెంబరు 6న ఫ్లోరిడాలోని పెన్సాకోలా వద్ద ఉన్న నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌పై ఓ సౌదీ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా... ముగ్గురు అమెరికా సెయిలర్లు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఏక్యూఏపీ ముందుకువచ్చింది. 

ఇక ఈ ఘటనపై విచారణ జరిపిన ఎఫ్‌బీఐ.. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని మహ్మద్‌ అల్‌శమ్రానీగా గుర్తించింది. అతడు రాయల్‌ సౌదీ వైమానిక దళానికి చెందినవాడని, ప్రస్తుతం మహ్మద్‌ అమెరికాలో శిక్షణ పొందుతున్నాడని పేర్కొంది. మహ్మద్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడని.. ‘‘నేను దుష్టులకు వ్యతిరేకం, అమెరికా ఓ దుష్టశక్తిగా అవతరించింది. కేవలం ముస్లింలకే కాకుండా, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని ద్వేషిస్తున్నాను’’ అంటూ ఆల్‌-ఖైదా వ్యవస్థాకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అనేక పోస్టులు పెట్టినట్లు గుర్తించింది. ఇదిలా ఉండగా.. మహ్మద్‌ చర్యను సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తీవ్రంగా ఖండించారు. హేయమైన నేరానికి పాల్పడిన మహ్మద్‌ క్షమార్హుడు కాదని పేర్కొన్నారు. కాగా విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న దాదాపు 5 వేల మంది సౌదీ బలగాల్లో దాదాపు 850 మంది అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు.

చదవండి: అభిశంసన: ట్రంప్‌నకు భారీ ఊరట..!

కాగా మధ్యప్రాచ్య దేశమైన యెమెన్‌పై ఆధిపత్యం సాధించేందుకు ఆల్‌-ఖైదా సహా పలు ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తుండగా.. అక్కడి ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. 2014లో మొదలైన ఈ యుద్ధంలో తిరుగుబాటుదారులకు ఇరాన్‌ సహకారం అందిస్తోంది. అంతర్యుద్ధం కారణంగా యెమెన్‌లో ఎంతో మంది పౌరులు దుర్మరణం పాలవుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా తినడానికి తిండిలేక చిన్నారులు ఎముకల గూడులా మారి ప్రాణాలు కోల్పోతున్నారు.

మరిన్ని వార్తలు