అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు

2 May, 2020 12:43 IST|Sakshi

కమిటీ ముందు హాజరు కావాలని అమెజాన్ సీఈవోకు  ఆదేశాలు

లేదంటే దావా వేస్తామని హెచ్చరిక

వాష్టింగ్టన్ : టెక్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌ అమెరికాలో మరోసారి  చిక్కుల్లో పడ్డారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల ఆరోపణలపై  విచారణకు స్వచ్ఛందంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.   స్వచ్ఛందంగా హాజరు కావడానికి అంగీకరించకపోతే  దావాను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అమెరికా అధికారులు  ఆయన్ను హెచ్చరించారు. 

స్వయగా జెఫ్ బెజోస్ హాజరై తన సాక్ష్యమివ్వాలని ఆదేశించారు. ఈ మేరకు రెండు పార్టీలకు చెందిన హౌస్ జ్యుడిషియరీ కమిటీ నాయకులు  బెజోస్‌కు శుక్రవారం రాసిన లేఖలో కోరారు. అమెజాన్ చేసిన ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని నిరూపితమైతే మోసపూరిత, నేరపూరిత అపరాధంగా పరిగణిస్తామని కమిటీ ఛైర్మన్, రిపబ్లిక్ జెరోల్డ్ నాడ్లర్, ఇతరులుసంతకం చేసిన లేఖలో పేర్కొన్నారు. స్వచ్ఛంద ప్రాతిపదికన సాక్ష్యమిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే  తప్పనిసరి ప్రక్రియను ఆశ్రయించే హక్కు తమకుందని స్పష్టం చేశారు. అయితే తాజా పరిణామంపై అమెజాన్ ప్రతినిధులు స్పందించాల్సి వుంది.  

అమెజాన్ తన మార్కెట్  ప్లేస్ లో అమ్మకందారుల గురించి, వారి ఉత్పత్తులు లావాదేవీల గురించి సున్నితమైన సమాచారాన్ని దాని సొంత పోటీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఉపయోగించిందని ఇటీవలి వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.  అయితే అమెజాన్ ఎగ్జిక్యూటివ్ గత జూలైలో జరిగిన కమిటీ విచారణలో దీన్ని ఖండించారు. అమెరికాలోని జస్టిస్ డిపార్ట్ మెంట్  ఫెడరల్ ట్రేడ్ కమిషన్  ప్రధానంగా నాలుగు  టెక్ దిగ్గజాలపై గత కొంతకాలంగా యాంటీట్రస్ట్ విచారణను కొనసాగిస్తున్నాయి. డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని యాంటీట్రస్ట్ ఉపసంఘం గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, ఆపిల్‌ లాంటి టెక్ దిగ్గజాలపై దృష్టి సారించింది. వినియోగదారులపై వాటి ప్రభావంపై సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా  జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికను అడ్డం పెట్టుకుని  తప్పుడు పద్ధతులను అవలంబిస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.  దీంతో  అమెజాన్ కంపెనీ భారీ ఇక్కట్లను ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే.  (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట)

మరిన్ని వార్తలు