‘తప్పు చేశాను.. నాకేం కాదు అనుకున్నాను’

13 Jul, 2020 14:49 IST|Sakshi

న్యూయార్క్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్‌తో పోరాడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. అగ్ర రాజ్యంలో ఇప్పటి వరకు 34,13,995 మంది కరోనా బారిన పడగా.. 1,35,000 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. ఓ వైపు కరోనా ప్రజలను గడగడలాస్తున్నప్పటికీ వైరస్‌ తీవ్రతను కొంతమంది పట్టించుకోవడం లేదు. తమకు ఏం కాదని  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. (అగ్రరాజ్యంలో కరోనావిలయతాండవం)

ఈ క్రమంలో కోవిడ్‌ సోకిన వ్యక్తి ఇచ్చిన పార్టీకి హాజరవ్వడం వల్ల మహమ్మారి సోకి ఓ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఓ వ్యక్తి కరోనా వ్యాధి సోకి బాధపడుతుంటే.. తమకు వైరస్‌ సోకుతుందో లేదో చూడటానికి స్నేహితులతో కలిసి ఆదివారం పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పార్టీకి హాజరైన ఓ యువకుడు లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. మహమ్మారితో మరణించే ముందు ఆ వ్యక్తి నర్సుతో ఇలా మాట్లాడాడు. ‘నేను తప్పు చేశానని అనిపిస్తోంది. కరోనా వ్యాధి అబద్దమని, తప్పుడు వార్త అని అనుకున్నాను. నేను యువకుడిని కాబట్టి నాకు వైరస్‌ సోకదని విర్రవీగాను. వైరస్‌ కంటికి కనిపించకపోవడంతో నాకు ఏం కాదని భ్రమపడ్డాను’ అని చివరి క్షణాల్లోని తన ఆవేదనను చెప్పుకొచ్చాడు. (అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న 20 మందికి పాజిటివ్)

యువకుడి మరణంపై శాన్‌ఆంటోనియోలోని మెథడిస్ట్‌ హాస్పిటల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జేన్‌ఆపిల్బీ మాట్లాడుతూ.. యువకుడు అనారోగ్యంగా కనిపించకపోయినప్పటికీ పరీక్షలు నిర్వహించడం వల్ల  అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించి పోయిందని తెలిపారు. దేశంలో ఆందోళనకర స్థాయిలో కరోనా మరణాలు సంభవిస్తున్నప్పటికీ యువత వైరస్‌ తీవ్రతను అర్థం చేసుకోవడం లేదన్నారు. కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యువకులు ఎంతో మంది వైరస్‌ బారిన పడుతునట్లు పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో భారీ స్థాయిలో ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. (భార్యను బతికించండని వేడుకోవడం కలచివేసింది..)

>
మరిన్ని వార్తలు