అమెరికాలో ఎన్నారై సూపర్ మార్కెట్‌కు నిప్పు!

12 Mar, 2017 22:57 IST|Sakshi
ఎన్నారైకి చెందిన స్టోర్‌(ఇన్‌సెట్‌లో నిందితుడు రిచర్డ్‌)

ప్లోరిడా: అగ్రరాజ్యంలో జాత్యంహకార దాడులు ఆగడం లేదు. కూఛిబొట్ల, పటేల్‌ ఘటనలను మరవకముందు తాజాగా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. దానిని కాల్చివేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, ఆ స్టోర్‌ భారత సంతతి పౌరులదని తనకు తెలియదని, అరబ్‌ ముస్లింలది అని అనుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసలను అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి తొలుత దాడులు భారతీయులపైనే ఎక్కువవుతున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. రిచర్డ్‌ లాయిడ్‌ అనే 64 ఏళ్ల వ్యక్తి దర్జాగా దుకాణానికి నిప్పుపెట్టి చేతులు వెనక్కి పెట్టుకొని అది తగులబడుతుంటే నవ్వుతూ నిల్చున్నాడు. తమ దేశంలో అరబ్‌ దేశాలకు చెందిన ముస్లిలు అస్సలు ఉండొద్దనేది తన కోరిక అని, అందుకే దుకాణాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించానని చెప్పాడు. తనను అరెస్టు చేసుకోవచ్చంటూ పోలీసులకు స్వయంగా చెప్పాడు. ఇతడి వ్యాఖ్యలపై స్థానిక అధికారులు విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

భారతీయ సంతతి ప్రాసిక్యూటర్‌ తొలగింపు
అత్యున్నతస్థాయి ఫెడరల్‌ ప్రాసిక్యూటర్‌ ఒకరిని ట్రంప్‌ ప్రభుత్వం తొలగించింది. భారతీయ సంతతికి చెందిన ప్రీత్‌ బరార్‌ను బలవంతంగా తొలగించింది. ‘నేను రాజీనామా చేయడానికి తిరస్కరించాను. ట్రంప్‌ వర్గం నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నాకు ఎటువంటి సమాచారం అందజేయకుండానే పదవి నుంచి తొలగించారు. అమెరికా అటార్నీగా పనిచేయడాన్ని నేను గౌరవంగా భావిస్తాను. తాను పోస్టులో కొనసాగుతానని ఎన్నికల తర్వాత ట్రంప్‌ను కలిసి చెప్పారు. అప్పట్లో ఆయన దీనికి అంగీకరించారు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. బరాక్‌ ఒబామా నియమించిన ప్రాసిక్యూటర్లను శుక్రవారం ట్రంప్‌ సర్కారు తొలగించింది. మూకుమ్మడిగా ప్రాసిక్యూటర్లను తొలగించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.

అలీ కుమారుడికి మళ్లీ అవమానం
విఖ్యాత బాక్సర్‌ మహ్మద్‌ అలీ కుమారుడు అలీ జూనియర్‌ను అధికారులు మరోసారి ఎయిర్‌పోర్టులో అడ్డుకొని చాలాపుపు ప్రశ్నించారు. అలీ బుధవారం వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్టుకు రాగా అధికారులు దాదాపు 20 నిమిషాలపాటు ప్రశ్నించారు. అలీ తన పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్సు చూపాకే ఫోర్ట్‌ ఫ్లోరిడా విమానం ఎక్కడానికి అనుమతించారు. గత నెల ఏడున కూడా అలీ తన తల్లి ఖలీలా కమాచో అలీతోపాటు జమైకా నుంచి ఫోర్ట్‌ లాడెర్‌డేల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, తనిఖీల పేరుతో అధికారులు వారిని నిర్బంధించారు. అయితే అలీ ధరించిన ఆభరణాల గురించి స్కానర్ల నుంచి అలారం రావడంతో ఆయనను ఆపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తాము ముస్లింలు కావడంతో వల్లే అధికారులు ప్రశ్నించారని అలీ, ఆయన తల్లి గతంలో ఆరోపించారు.

ట్రావెల్‌ బ్యాన్‌ను వ్యతిరేకించిన నిపుణులు
వాషింగ్టన్‌: సవరించిన ప్రయాణ నిషేధ ఉత్తర్వులపై విదేశాంగ నిపుణులు మండిపడుతున్నారు. అసలైన ఉత్తర్వులు కంటే ఈ తాజా ఉత్తర్వులు అమెరికా జాతీయ భద్రతను, ప్రయోజనాలను దెబ్బతీస్తాయని 130 మందికి పైగా విదేశాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఐసిస్‌ బాధితులు, ఆ ఉగ్రవాద సంస్థతో తలపడుతున్న ముస్లింలకు ఈ ఉత్తర్వులు తప్పుడు సంకేతాలిస్తాయని, ఇస్లాంతో అమెరికా యుద్ధం చేస్తోందనే తప్పుడు ప్రచారానికి ఊతమిస్తుందని  చెప్పారు. ముస్లిం శరణార్థులను, ప్రయాణికులను అనుమతించడంద్వారా ఉగ్రవాదులు చేసే అబద్ధపు ప్రచారానికి కళ్లెం వేయొవచ్చని ఆ విదేశాంగ నిపుణులందరకూ కలసి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లెర్‌సన్, రక్షణ మంత్రి జేమ్స్‌ మేటిస్, అటార్నీ జనరల్, జాతీయ భద్రత చీఫ్‌లకు పంపారు. ఈ లేఖ రాసిన వారిలో గతంలో డెమోక్రటిక్, రిపబ్లికన్‌ ప్రభుత్వాల హయాంలో పనిచేసిన అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు