హెచ్1బీ వీసాలు ఇక కష్టమేనేమో!

25 Dec, 2017 20:35 IST|Sakshi

అమెరికాలో తాత్కాలిక ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసా జారీ నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఈ  వీసాల జారీకి ఎంపిక ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయాలనే ప్రతిపాదనను అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ శాఖ(డీహెచ్ఎస్) రూపొందిస్తోంది. ఇది అమల్లోకి వస్తే అమెరికా వెళ్లాలనుకునే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) నిపుణులకు అవకాశాలు తగ్గిపోతాయి. భారత ఐటీ సేవల కంపెనీలకూ దీని వల్ల గట్టి దెబ్బ తగులుతుంది. 1990 నుంచి లాటరీ పద్ధతిలో నిర్ణీత గరిష్ఠ పరిమితితో ఈ వీసాలు జారీ చేస్తున్నారు. హెచ్1బీ వీసాలకు  అనుసరిస్తున్న ఈ ఎంపిక ప్రక్రియలో మార్పులకు 2011లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. దీన్ని వచ్చే ఏడాది నుంచి ఆచరణలోకి తేవాలని డీహెచ్ఎస్ యోచిస్తోందని అంతర్జాతీయ వలసల సంస్థ ఫ్రాగోమన్ వరల్డ్వైడ్ తన వెబ్సైట్లో తెలిపింది.

ఈ ఆరేళ్లనాటి ప్రతిపాదన ప్రకారం హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు హెచ్1బీ వీసాల లాటరీలో పాల్గొనడానికి ముందు తమ పేర్లు నమోదుచేయించుకోవడం తప్పనిసరి. అలాగే, ఈ లాటరీ ద్వారా వీసాలు పొందడానికి ముందు నమోదు ద్వారా నంబరు సంపాదించాకే తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా అత్యధిక జీతం, గరిష్ట స్థాయి నైపుణ్యం ఉన్న  నిపుణులకు అమెరికాలో పనిచేసే అవకాశం కల్పించడానికి అనువైన హెచ్1బీ వీసాలు జారీచేసే ప్రాధాన్యతా పద్ధతిని డీహెచ్ఎస్ ప్రవేశపెడుతుందని ఈ సంస్థ తెలిపింది. అమెరికాలో పనిచేయడానికి వీసాల కోసం దరఖాస్తుచేసేవారి కనీస వేతనం మార్చాలని కూడా హోంలాండ్ విభాగం భావిస్తోంది.

వచ్చే ఏడాది ఈ మార్పులు అమల్లోకి రావా?
హెచ్1బీ వీసాల జారీకి దరఖాస్తుల పరిశీలన, లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియలో తలపెట్టిన పై మార్పులపై 2018 ఫిబ్రవరి వరకూ అధికారిక ప్రకటన వెలువడదనీ, ఫలితంగా కొత్త ప్రతిపాదన వచ్చే ఏడాది హెచ్1బీ దరఖాస్తుల సమర్పణకు వర్తించదని కూడా ఫ్రాగోమన్ వివరించింది. తాత్కాలిక ఉద్యోగాలకు విదేశీ నిపుణులను రప్పించడానికి అమెరికా కంపెనీలకు ఉపకరించే సాధనం హెచ్1బీ వీసా. లాటరీ పద్ధతి ద్వారా ఈ వీసాల జారీకి దరఖాస్తుదారులను ఎంపిక చేసే విధానం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. ఈ తరహా వీసా దరఖాస్తులను పెద్ద సంఖ్యలో పంపే భారత ఐటీ కంపెనీలు అత్యధిక సంఖ్యలో హెచ్1బీ వీసాలు సంపాదిస్తూ ఎక్కువ లబ్ధిపొందుతున్నాయి. సాధారణ కేటగిరీలో 65,000 మందికి, ఉన్నత డిగ్రీలున్న నిపుణులకు మరో 20,000 హెచ్1బీ వీసాల జారీకి ఏటా అమెరికా పౌసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) లాటరీ పద్ధతిలో ఎంపికచేస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పుల వల్ల డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చేసిన నిపుణుల దరఖాస్తులకు ఈ తరహా వీసాల జారీలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

అత్యవసర నిబంధనగా ప్రదేశపెడితే కంపెనీలకు ఇబ్బందే!
ఎంపిక ప్రక్రియలో మార్పులు తేవాలనే పై ప్రతిపాదనను అత్యవసర నిబంధన(ఎమర్జెన్సీ రూల్)గా ప్రవేశపెడితే వచ్చే ఏడాది అనేక కంపెనీలు హెచ్1బీ వీసా దరఖాస్తులు దాఖలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, గత కొన్ని నెలలుగా యూఎస్సీఐఎస్ ఈ ఎంపిక ప్రక్రియలో అనేక మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసిందనీ, ఈ మార్పులన్నీ అమలైతే హెచ్1బీ వీసా పొందడం చాలా కష్టమౌతుందని అమెరికాలోని కార్నెల్ లా స్కూల్ ప్రొఫెసర్ స్టీవెన్ యేల్ లీహర్ చెప్పారు. ‘‘ఈ వీసా దరఖాస్తుదారులు తమ అర్హతకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాలు సమర్పించాలని అధికారులు అడిగే సందర్భాల సంఖ్య 41 శాతం పెరిగిందని ఆయన వివరించారు. కొన్ని రకాల కంప్యూటర్ ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం ఎంత వరకు ఉందో చెప్పాలని కూడా వివిధ కంపెనీలను యూఎస్సీఐఎస్ ప్రశ్నిస్తోంది. ‘‘హెచ్1బీ దరఖాస్తుల ఆమోదానికి యూఎస్సీఐఎస్ గతంతో పోల్చితే ఎక్కువ సమయం తీసుకుంటోంది. విదేశాంగ శాఖ కాన్సులేట్లు కూడా వీసా దరఖాస్తులను మరింత శ్రద్ధగా పరిశీలిస్తున్నాయి.’’ అని లీహర్ తెలిపారు. నైపుణ్యమున్నా లేకున్నా మొత్తంగా అమెరికాలోకి వలసదారుల ప్రవేశాన్ని అడ్డుకోవాలనే పట్టుదలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి చెందిన భారతీయ అమెరికన్ వివేక్ వాధ్వాన్ చెప్పారు.

-సాక్షి నాలెడ్జ్ సెంటర్

మరిన్ని వార్తలు