అమెరికాను వెంటాడుతున్న కరోనా

31 May, 2020 19:48 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌కి మద్దతుగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. నిరసనల్లో పాల్గొన్న కొంతమంది ఆందోళకారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. మినియాపోలీస్‌ నగరంలో అంటుకున్న నిరసన జ్వాలలు దేశమంతా విస్తరించగా.. చాలాచోట్లు నిరసకారులు వైరస్‌ బారిన పడ్డట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే అట్లాంటా సిటీ మేయర్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. శనివారం రాత్రి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. (విడాకులకు దారి తీసిన జార్జ్‌ మృతి)

శనివారం నాటి ఆందోళనల్లో కొంతమందికి వైరస్‌ సోకినట్లు తేలడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని, ఇలాంటి సమయంలో గుంపులు గుంపులుగా మెలగడం అంత శ్రేయస్కరం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుంటే పెద్ద విపత్తును ఎదుర్కొక తప్పదని మేయర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాజా నిరసనల నేపథ్యంలో అమెరికా వైద్యలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సమూహాలు ఏర్పడటంతో వైరస్‌ సులువుగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18లక్షలు దాటింది. లక్షకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఆందోళనలతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న భయం అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది.

కాగా జార్జి ఫ్లాయిడ్‌ పోలీస్‌ కస్టడీలో మృతి చెందడంతో కోవిడ్‌ నేపథ్యంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను ఆందోళనకారులు ధిక్కరించారు. మినియాపోలిస్‌లో పాటు మరికొన్ని నగరాల్లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. జార్జ్‌ మృతికి కారణమైన పోలీసులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ను కింద పడేసి, డెరెక్‌ చౌవిన్‌ అనే అధికారి అతడి మెడపై 9 నిమిషాల పాటు మోకాలితో తొక్కిపెట్టి ఉంచడంతో అతడు ఊపిరాడక చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసు అధికారి చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులపై కేసు నమోదు చేశారు. వీరిపై నేరం రుజువైతే 12 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముంది.


 

మరిన్ని వార్తలు