ట్రంప్‌కు ఎదురుగాలి

7 Nov, 2018 14:32 IST|Sakshi

హౌస్‌లో డెమోక్రాట్ల హవా

సెనేట్‌లో  పరువు నిలుపుకుంటున్న రిపబ్లికన్లు

వాషింగ్టన్‌: మధ్యంతర ఎన్నికల్లో  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుగాలి వీస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర  ఎన్నికల ఫలితాల్లో  డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మార్చుకుని విజయం  దిశగా సాగిపోయారు. తాజా ఫలితాల సరళి చూస్తోంటే డెమొక్రాట్ల ‘బ్లూ వేవ్‘ను అడ్డుకోగలుగుతానన్న ట్రంప్‌ నమ్మకానికి గండి పడుతున్నట్టు కనిపిస్తోంది.

ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో డెమోక్రాట్లు మెజార్టీ దిశగా దూసుకుపోతూ పట్టు సాధించారు. అటు  ట్రంప్‌  రిపబ్లికన్‌ పార్టీ  అభ్యర్థులు సెనేట్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకునే  ప్రయత్నం చేస్తోంది.  ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్‌ జరిగింది. తాజా ఫలితాల ప్రకారం 218 స్థానాల్లో డెమెక్రాట్లు గెలుపొందితే ప్రతినిధుల సభలో మెజార్టీ ఖాయం చేసుకుంది.  మిచిగాన్‌, ఇల్లినాయిస్‌, కాన్సాస్‌,వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సీల్వేనియా  తదితర రాష్ట్రాల్లో డెమోక్రాట్లు గెలుపొందారు. ఇండియానా, టెక్సాస్‌, నాత్‌ డకోటా తదితర స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు.

మరోవైపు  అమెరికా కాంగ్రెస్‌లో మహిళలు తమ  సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 89మంది హౌస్‌కు ఎంపిక కాగా తొలిసారిగా సెనేట్‌కు ఇద్దరు ముస్లిం మహిళలు రషిదా త్లయీబా ఇహాన్‌ ఒమర్‌లతోపాటు మసాచుసెట్స్‌ నుంచి తొలిసారిగా నల్లజాతీయురాలైన కాంగ్రెస్‌ మహిళ, అరిజోనా, టెన్నీసీ ప్రాంతాల నుంచి ఇద్దరు మహిళా సెనేటర్లు గెలుపొందడం విశేషం. జారెడ్‌ పోలీస్‌ అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎంపికైన తొలి గే గా  చరిత్ర కెక్కనున్నారు.

కాగా  రెండేళ్ళ కన్నా తక్కువకాలంలోనే తన ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని అమెరికా అద్యక్షుడు డో నాల్డ్‌ ట్రంప్‌ తన ఎన్నికల  ప్రచార సభలో చెప్పుకొచ్చారు.  తన విదేశాంగ విధానాలు, పాలన ప్రజలకు ఆమోదయోగ్యమయ్యాయని,  50 రాష్ట్రాలకు గాను పలు రాష్ట్రాల్లో ఓటర్లు తనకే పట్టం కడతారని ట్రంప్ విశ్వాసం  ప్రకటించగా.. అటు  డెమొక్రాట్లు తమదే విజయమని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు