చేతిలో చెవిని పెంచారు..!!

11 May, 2018 17:29 IST|Sakshi
చేతిలో చెవిని పెంచుతున్న సమయంలో తీసిన చిత్రం

టెక్సస్‌ : వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుందనడానికి టెక్సస్‌లో జరిగిన ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఓ వ్యక్తి శరీరంలో ఏదైనా అవయవం పాడైపోతే.. దాని స్థానంలో మరో వ్యక్తి నుంచి సేకరించిన అవయవాన్ని అమర్చుతున్నారు. కానీ అమెరికా మిలిటరీ వైద్యులు చెవిని కొల్పోయిన ఓ మహిళ శరీరంలోనే కొత్త చెవిని పునరుత్పత్తి చేశారు. వివరాల్లోకి వెళితే... ఆర్మీలో పనిచేస్తున్న షమిక బ్యూరేగ్‌ అనే అధికారిణి  2016లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో ఆమె తన చెవిని కొల్పోయారు.

వినికిడి శక్తిని కోల్పోయారు. దీంతో ఆమెను తిరిగి ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని భావించిన మిలిటరీ వైద్యుల బృందం సహజసిద్ధమైన చెవిని తిరిగి ఏర్పరచాలని భావించారు. ఇందుకోసం 2012లో తొలిసారి జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీలో సహజసిద్ధంగా చెవిని తిరిగి సృష్టించి.. దానిని అమర్చిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మిలటరీ వైద్యులు ఆ దిశగా అడుగులు వేశారు.

టెక్సస్‌లోని విలియం బ్యూమెంట్‌ మెడికల్‌ సెంటర్‌లో షమిక పక్కటెముకల నుంచి మృదులాస్థిని తీసుకొని దాన్ని చెవి ఆకృతిలోకి మార్చారు. ఆ తర్వాత దానిని ఆమె ముంజేతిలో అమర్చి.. స్వతహాగా అది వృద్ధి చెందించడంతో పాటు కొత్త రక్త నాళాలు, స్పందనలు ఏర్పడేలా చేశారు. తర్వాత శస్త్ర చికిత్స ద్వారా చెవిని తిరిగి షమికకు అమర్చారు.

దీనిపై షమిక మాట్లాడుతూ.. ‘మొదట్లో నేను దీనికి ఇష్టపడలేదు. వైద్యులు, ఆర్మీ అధికారులు దీని గురించి పూర్తిగా వివరించిన తర్వాత బాగుంటుందేమో అనిపించింది. అవయవ మార్పిడి భయం కలిగించినప్పటికీ నాకు చెవి ఉంటే బాగుంటుందని అనిపించడంతో ఇందుకు ఒప్పుకున్నాను’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు