-

ఐసిస్‌ చీఫ్‌ హతం: ఫొటోలు, వీడియో విడుదల

31 Oct, 2019 08:38 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బాకర్‌ అల్‌ బాగ్దాదీని తమ సేనలు మట్టుబెట్టిన తీరు అభినందనీయమని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకెంజీ అన్నారు. బాగ్దాదీని హతం చేసే క్రమంలో సాధారణ పౌరులెవరూ గాయపడకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. సిరియాలో మారణహోమం సృష్టించి.. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన బాగ్దాదీని అగ్రరాజ్య సైన్యం ఆదివారం అంతమొందించిన విషయం తెలిసిందే. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌ తలదాచుకున్న బాగ్దాదీని అమెరికా సేనలు చుట్టుముట్టడంతో.. తనను పేల్చుకుని అతడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తునాతునకలైన శరీర భాగాల నుంచి డీఎన్‌ఏను ఘటనాస్థలిలోనే సేకరించిన ఫోరెన్సిక్‌ నిపుణులు అది బాగ్దాదీ మృతదేహమేనని ధ్రువీకరించారు. అనంతరం ఒసామా బిన్‌లాడెన్‌ తరహాలోనే బాగ్దాదీ శరీర భాగాలను సముద్రంలో కలిపేశారు.(చదవండి : ఐసిస్ చీఫ్‌ బాగ్దాదీని పట్టించింది అతడే!)

ఇక బాగ్దాదీ చేతుల్లో చిత్రహింసలు అనుభవించి హత్యగావించబడిన అమెరికా మానవహక్కుల కార్యకర్త కైలా ముల్లర్ పేరిట చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పెంటగాన్‌ గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్‌ ఫ్రాంక్‌ మెకెంజీ మాట్లాడుతూ... ‘ బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటలిజెన్స్‌ వర్గాలు కీలకంగా వ్యవహరించాయి. అతడు తలదాచుకున్న చోటును కచ్చితంగా కనిపెట్టగలిగాం. పక్కా ప్లాన్ ప్రకారం అతడి ఇంటిని చుట్టుముట్టి ప్రత్యేక బృందాల సహాయంతో అంతమొందించాం. ఇందులో హెలికాప్టర్‌ దాడులు ప్రముఖమైనవి. అవి సిరియాకు చేరుకున్న అనంతరం ఆపరేషన్‌ మరింత కఠినతరంగా మారినట్లు అనిపించింది. అయితే లక్ష్యాన్ని పక్కాగా ఛేదించడం(బాంబులు వేయడం)లో ఆ రెండు హెలికాప్లర్టు సఫలీకృతమయ్యాయి. సాధారణ పౌరులెవరూ గాయపడకుండా జాగ్రత్త వహించాయి. ఇంటలెజిన్స్‌, అమెరికా సైన్యం సహాయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశాం. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన ఉగ్రవాదిని సమూలంగా నాశనం చేశాం’ అని పేర్కొన్నారు.(చదవండి : ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!)

మరిన్ని వార్తలు