ఆ ఆపరేషన్‌తో ఇక కొత్త జీవితం!

16 Oct, 2019 15:40 IST|Sakshi
‘రే’కు విజయవంతంగా ఆపరేషన్‌ చేసిన బాల్టిమోర్‌లోని ఆస్పత్రి సిబ్బంది.

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా నౌకా దళానికి చెందిన ‘రే’ (పూర్తి పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడ లేదు) 2010లో అఫ్ఘానిస్థాన్‌లో సైనిక విధులు నిర్వర్తించారు. ఆ సందర్భంగా ఓ రోజు పొరపాటున రోడ్డు పక్కన తాలిబన్లు అమర్చిన మందు పాతర మీద కాలు పెట్టారు. అది పేలి పోవడంతో రెండు కాళ్లు తెగి పోయాయి. ఆయన్ని హుటిన అమెరికాలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆయన రెండు  కృత్రిమ కాళ్లను అమర్చుకొని నడవడం మొదలు పెట్టారు. అయినప్పటికీ ఆయన లోలోల ఎందుకో కుములి పోసాగారు. ఆ తర్వాత కొంత కాలానికి అతి సన్నిహితులకు అసలు విషయం చెప్పారు. 

నాటి బాంబు పేలుడులో తన పురుషాంగం, బీజావయ సంచీ పూర్తిగా దెబ్బతిన్నాయని, వైద్యులు వాటిని ఆపరేషన్లలో తీసివేశారని ‘రే’ చెప్పుకున్నారు. ఇక తనకు సంసార సుఖం లేనట్లేనా ? అంటు బాధ పడ్డారు. పేలుడు జరిగినప్పుడు ‘రే’ వయస్సు 30 ఏళ్లు. ఈ విషయం వెల్లడించినప్పుడు ఆయన వయస్సు 33 ఏళ్లు. పురుషాంగం మార్పిడికి అవకాశం ఉందా ? అన్న అంశంపై అప్పటి నుంచి వైద్యులను సంప్రతించడం మొదలు పెట్టారు. 2013లోనే బాల్టిమోర్‌లోని ‘జాన్‌ హాప్‌కిన్స్‌ మెడిసిన్‌’ ఆస్పత్రిలో ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రిచర్డ్‌ రెడిట్‌ను కలుసుకున్నారు. తన బాధ గురించి ఆయనకు చెప్పుకున్నారు. పురుషాంగం దాత దొరికనప్పుడు తప్పకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అప్పటి వరకు ప్రపంచలో ఎవరు కూడా పురుషాంగం మార్పిడి ఆపరేషన్‌ చేయక పోవడంతో డాక్టర్‌ కూడా ఆ విషయం అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. 

ఆస్పత్రిలో కోలుకుంటున్న ‘రే’ 

ఆ తర్వాత ఐదేళ్లకు 2018లో మేరీలాండ్‌ రాష్ట్రంలో మెదడు చచ్చుపడిన ఓ రోగి పురుషాంగం దానం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. మేరీలాండ్‌ నుంచి బాల్టిమోర్‌కు అద్దె జెట్‌ విమానంలో అవయవాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆపరేషన్‌కు సిద్ధం చేసిన ‘రే’కు 14 గంటలపాటు ఆపరేషన్‌ నిర్వహించి విజయవంతంగా పురుషాంగాన్ని అతికించారు. అలాంటి ఆపరేషన్‌ ప్రపంచంలో విజయవంతం అవడం అదే మొదటి సారి. దాంతో ఆ వైద్య బృందానికి అంతర్జాతీయంగా ప్రశంసలు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా మూడంటే మూడే పురుషాంగం మార్పిడి ఆపరేషన్లు విజయవంతం అయ్యాయి. 2006లో చైనా వైద్యు పురుషాంగం మార్పిడికి మొదటి సారి ప్రయత్నించి విఫలమయ్యారు. పురుషాంగంలో తల వెంట్రుకలకన్నా సన్నని రక్త నాళాలతోపాటు, సంక్లిష్టమైన రక్త నాళాల వ్యవస్థ ఉంటుందట. అందుకనే ఆపరేషన్‌ చాలా క్లిష్టమట. 

‘రే’కు పురుషాంగంతోపాటు బీజాల సంచిని కూడా దాత నుంచే సేకరించి అతికించారు. సంచిలోని బీజాలను మాత్రం తొలగించారు. బీజాల్లోనే ‘వీర్యం’ ఉత్పత్తి అవుతుంది కనుక, వాటిని కూడా అమర్చినట్లయితే సంతానం దాతకు చెందినది అవుతుందన్న భావంతో కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని బీజాలను తొలగించారు. వాటి స్థానంలో కృత్రిమ బీజాలను అమర్చే అవకాశం ఉంది. అలా చేశారా, లేదా అన్నది తెలియలేదు. ఈ విషయాన్ని ‘రే’ కూడా వెల్లడించలేదు. గత కొన్ని రోజులుగా తన పురుషాంగం స్తంభిస్తోందని, వైద్య సహాయం లేకుండానే తాను మూత్రం పోయగలుగుతున్నానని ఆయన చెప్పారు. లైంగిక వాంఛ ఉద్దీపన కోసం తనకు వైద్యులు ‘టెస్టోస్టెరోమ్‌’ ఎంజైమ్‌ ఇస్తున్నారని అన్నారు. ఇప్పటి నుంచి తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని, ఈ అవకాశం కల్పించిన వైద్య బృందానికి తన ధన్యవాదాలని ‘మిట్‌ టెక్నాలజీ రివ్యూ’ మాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రే’ ఈ వివరాలు వెల్లడించారు. 

‘రే’ తనకు పెళ్లయిందో, లేదో వెల్లడించలేదు. అయితే ఆయన కొత్త సంసార జీవితాన్ని సంపూర్ణంగా ఆశిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని చిక్కుముడులు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిసినట్లు లేదు. కృత్రిమ బీజాలు అమర్చకపోతే ఆయనలో ‘వీర్యం’ ఉత్పత్తి అవకాశమే లేదు. కృత్రిమ బీజాలు అమర్చినా సక్సెస్‌ రేటు తక్కువే. వీర్యం ఉత్పత్తి లేకున్నా పురుషాంగం స్తంభిస్తుందని, లైంగిక వాంఛ తీర్చు కోవచ్చని, అయితే ‘స్కలనం’ ఉండదని వైద్యులు తెలిపారు. ఫలితంగా ‘రే’కు స్కలనానుభూతి దక్కదన్న విషయం సన్నిహితులెవరూ ఆయనకు చెప్పలేదని అర్థం అవుతుంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా