ఆ విషయం గురించి ట్రంప్‌ చర్చిస్తారు: అమెరికా

22 Feb, 2020 08:34 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత పర్యటనలో భాగంగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మతపరమైన స్వేచ్ఛ గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. భారత రాజ్యాంగం అక్కడి ప్రజలకు మతస్వేచ్ఛను ప్రసాదించిందని.. అక్కడ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. నాలుగు ప్రధాన మతాలకు భారత్‌ పుట్టినిల్లు అని, మత, భాషా, సాంస్కృతికంగా పరంగా ఉన్నతస్థాయిలో ఉన్న దేశమని కొనియాడారు. ట్రంప్‌ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 24న ట్రంప్‌ భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆందోళనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీ గురించి ట్రంప్‌.. మోదీతో చర్చిస్తారా అన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. (ట్రంప్‌ వెంటే ఇవాంకా కూడా..)

ఈ విషయాలపై స్పందించిన శ్వేతసౌధ అధికారులు... ‘‘భారత్‌ ప్రజాస్వామ్యం, మతపరమైన స్వేచ్ఛ గురించి సభలోనూ.. ఆ తర్వాత అంతరంగిక చర్చల్లోనూ అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడతారు. భారత ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలు, వ్యవస్థలపై అమెరికాకు అపారగౌరవం ఉంది. అయితే మతస్వేచ్ఛ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న విధానాలు, విలువలకు మేం కట్టుబడి ఉంటాం. సీఏఏ, ఎన్నార్సీ తదితర అంశాలపై మాకు అవగాహన ఉంది. ప్రజాస్వామ్య విలువలు, మైనార్టీల హక్కులకు భంగం కలగకుండా భారత్‌ తన సంప్రదాయాలను కొనసాగించాలని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మతపరమైన మైనార్టీలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో మోదీ తన మొదటి ప్రసంగంలోనే స్పష్టం చేశారు’అని పేర్కొన్నారు.(గుజరాత్‌ మోడల్‌పై గోడలెందుకు?)

కాగా కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్‌ పలుమార్లు ప్రకటించగా.. ఆయన ప్రతిపాదనను  భారత్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసిన భారత్‌... సీఏఏ, ఎన్నార్సీల గురించి ఒకవేళ ట్రంప్‌ చర్చలో ప్రస్తావిస్తే ఎలా స్పందిస్తుందోనన్న విషయం చర్చనీయాంశమైంది. సీఏఏను పోలి ఉండే బడ్జెట్‌ బిల్లు(​కొన్ని వర్గాలను మినహాయించి.. ఇరాన్‌ నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయిం ఇవ్వడం)పై ఇటీవల సంతకం చేసిన ట్రంప్‌.. మోదీతో మతపరమైన స్వేచ్ఛ గురించి మాట్లాడతారనడం హాస్యాస్పదమే అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ట్రంప్‌ తాజా పర్యటనలో భాగంగా వాణిజ్యపరంగా బ్రహ్మాండమైన డీల్‌ కుదిరే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. (ట్రంప్‌ భారత్‌ టూర్‌లో రాజభోగాలు)

మరిన్ని వార్తలు