ఎక్కువసేపు మాట్లాడొద్దు.. పెద్దగా ఊపిరి తీసుకోవద్దు!!

31 Jan, 2019 12:31 IST|Sakshi

అమెరికన్లకు అక్కడి అధికారుల సూచన 

న్యూయార్క్‌: మాట్లాడకుండా, ఊపిరి తీసుకోకుండా ఎలా ఉంటారు? అయినా.. ఇవేం పిచ్చి సూచనలు? ..ఇవే కదా మీ అనుమానాలు! తొందరపడి అక్కడి అధికారులను తిట్టుకోవద్దు. నిజానికి ప్రజల ప్రాణాలు కాపాడేందుకే అధికారులు ఈ రకమైన సూచనలు చేశారు. అసలు విషయమేంటంటే.. చలి అమెరికాను గడ్డకట్టించేస్తోంది. మనదగ్గర ఉష్ణోగ్రతలు ఏడెనిమిది డిగ్రీలకు పడిపోతేనే గజగజా వణికిపోతున్నాం. అమెరికాలోనైతే ఏకంగా మైనస్‌ 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. దీంతో అమెరికా రాజధాని వాషింగ్టన్‌, విస్కాన్సిన్, ఇలినాయిస్, మిచిగాన్‌ తదితర ప్రాంతాల్లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు.  
ఈ సందర్భంగా వాతావరణశాఖ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని.. బయటకు వెళ్లేటప్పుడు పెద్దగా ఊపిరి తీసుకోవద్దని, ఇతరులతో తక్కువగా మాట్లాడాలని సూచించారు. అలాగే ఇటువంటి చలి వాతావరణంలో బయట 10 నిముషాలకు మించి ఉంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. రానున్న రెండుమూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు