ప్రైవేటుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

13 Feb, 2018 03:46 IST|Sakshi
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

అమెరికా ఆలోచన

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)ను అమెరికా త్వరలోనే ప్రైవేటీకరించనుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది. భారీగా నిధులు వెచ్చించాల్సిరావడంతో ఐఎస్‌ఎస్‌ నిర్వహణ బాధ్యతల నుంచి 2025 నాటికి అమెరికా తప్పుకోనుందని నాసాకు చెందిన పత్రాలను ఉటంకిస్తూ వెల్లడించింది. నాసా, రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్‌ ఐఎస్‌ఎస్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో వాణిజ్య అవసరాలకు ఐఎస్‌ఎస్‌ను నాసా ప్రైవేటు సంస్థలకు అప్పగించే అవకాశముందని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఈ కథనంలో పేర్కొంది.

ఐఎస్‌ఎస్‌ నిర్వహణకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.963.97 కోట్లు అవసరమవుతాయని ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిందని పోస్ట్‌ తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి వీలుగా ఆయా సంస్థల నుంచి అభివృద్ధి ప్రణాళికల్ని, మార్కెట్‌ వ్యూహాలను నాసా కోరే అవకాశముందని వెల్లడించింది. 1998లో ఐఎస్‌ఎస్‌ను ప్రయోగించడంతో పాటు అభివృద్ది చేసేందుకు ఇప్పటివరకూ అమెరికా రూ.6.42 లక్షల కోట్ల(100 బిలియన్‌ డాలర్లు)ను ఖర్చుచేసిన నేపథ్యంలో ప్రైవేటీకరణకు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తంకావొచ్చని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు