జాత్యహంకార చర్యకు పాల్పడ్డ మిలిటరీ వెటరన్‌

27 Apr, 2019 16:19 IST|Sakshi

వాషింగ్టన్‌ : కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జాత్యహంకార చర్యకు పాల్పడ్డాడు. ముస్లిం వర్గానికి చెందిన వారిగా భావించి ఓ కుటుంబం మొత్తాన్ని కారుతో ఢీకొట్టాడు. మంగళవారం శాన్‌ ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇసయ్యా పీపుల్స్‌ (34) శాన్‌ ఫ్రాన్సిస్కోలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా తన ముందు ఉన్న గుంపుపైకి కారు ఎక్కించాడు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

కాగా బాధితులను ముస్లింలుగా భావించిన కారణంగానే ఇసయ్య ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని సన్నీవేల్‌ పబ్లిక్‌ సెక్యూరిటి విభాగం తన ప్రకటనలో పేర్కొంది. వారిని చంపడమే లక్ష్యంగా అతడు ఈవిధంగా ప్రవర్తించాడనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. అయితే బాధితుల కమ్యూనిటీ, జాతీయతకు సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ విషయం గురించి ఇసయ్య లాయర్‌ మాట్లాడుతూ.. గతంలో మిలిటరీ ఆఫీసరుగా పనిచేసిన ఇసయ్య ప్రస్తుతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ సైక్రియార్టిస్ట్‌ దగ్గర చికిత్స కూడా తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడితోనే ఈ విధంగా ప్రవర్తించాడని తెలిపారు.

మరిన్ని వార్తలు