కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ

14 Mar, 2020 08:12 IST|Sakshi

వాషింగ్టన్‌: మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్‌ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అదే విధంగా కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘సమాఖ్య ప్రభుత్వ అధికారాలను అనుసరించి ఈరోజు జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నాను’’అని శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్‌ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న ట్రంప్‌... ఈ ప్రాణాంతక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగంతో కూడా కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. (కరోనా విజృంభన: వణికిపోతున్న అమెరికా..)

అదే విధంగా దేశంలోని ప్రతీ ఆస్పత్రి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అమెరికన్ల వైద్య అవసరాలన్నింటినీ తీర్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ట్రంప్‌ సూచించారు. అయితే అమెరికన్లంతా కరోనా పరీక్షల కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదని... వైరస్‌ లక్షణాలు కనిపించిన వాళ్లు మాత్రమే ఆస్పత్రులకు వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రజలకు ఎదురైన ప్రతీ కష్టాన్ని తొలగించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా కరోనా వైరస్‌ టెస్టు కిట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.(మనిషిపై కరోనా ప్రభావమిలా..)

ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్‌.. కరోనా టెస్టులు నిర్వహించి, దాదాపు గంటలోపే ఫలితాలు వెల్లడించేందుకు రెండు ల్యాబులను ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. డియాసోరిన్‌ మాలిక్యులర్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా, క్యూఐఏజెన్‌ ఆఫ్‌ మేరీల్యాండ్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 1.3 మిలియన్ల డాలర్లు ఖర్చుచేయనున్నట్లు సమాచారం. ఇక ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి రుణాలపై ఉన్న వడ్డీని మాఫీ చేయడంతో పాటుగా.. భారీ మొత్తంలో క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు చేయాల్సిందిగా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా కోవిడ్‌ దెబ్బకు అమెరికా విశ్వవిద్యాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. ప్రజా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు అక్కడ నిరవధిక సెలవులు ప్రకటించారు.(కోవిడ్‌ దెబ్బ: భయపడవద్దన్న ట్రంప్‌!)

మరిన్ని వార్తలు