హెచ్‌ 1బీ ఆపేశారు

24 Jun, 2020 01:20 IST|Sakshi

ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం

హెచ్‌2బీ, జే, ఎల్‌1, ఎల్‌2 వీసాలపై కూడా.. డిసెంబర్‌ వరకు నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం

ఈ ఏడాది చివరి వరకు  గ్రీన్‌ కార్డుల జారీ సైతం నిలిపివేత

వలస విధానంలో మార్పులకు శ్రీకారం

లాటరీ ద్వారా హెచ్‌1బీ వీసాల జారీ పద్ధతికి స్వస్తి

ప్రతిభ, వేతనం ఆధారంగానే వీసాలు

అమెరికన్లకు ఉద్యోగావకాశాల మెరుగుకే ఈ నిర్ణయమన్న ట్రంప్‌

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతామన్న వైట్‌హౌస్‌

వీసాలపై తాత్కాలిక నిషేధంతో  5 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతాయని అధికారుల అంచనా

ట్రంప్‌ నిర్ణయంపై అమెరికన్ల హర్షం.. టెక్‌ దిగ్గజాల అసంతృప్తి

వాషింగ్టన్:‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్‌–1బీ, హెచ్‌–2బీ, జే, ఎల్‌1, ఎల్‌2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్‌ వరకు నిలిపివేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు జూన్‌ 24 నుంచి డిసెంబర్‌ 31 వరకు అమల్లో ఉంటాయి. వలస విధానంలో సమూల సంస్కరణల్ని తీసుకువచ్చి ఇకపై ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేయాలని అధికార యంత్రాంగానికి ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు.

అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్న ట్రంప్‌... తాను తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు లాభం చేస్తుందని అంటున్నారు. కరోనా వైరస్‌ వల్ల అమెరికాలో అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని కట్టడి చేసి, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచడానికే వలస విధానంలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. అత్యవసరాలైన ఆహారం, వైద్య రంగాలతోపాటు కరోనా పరిశోధనల్లో పని చేసే వారికి దీని నుంచి మినహాయింపులున్నాయి. గత ఏప్రిల్‌లో 60 రోజులపాటు ఈ వీసాలపై నిషేధం విధించిన ట్రంప్‌ సర్కార్‌ ఈ ఏడాది చివరి వరకు దీనిని పొడిగించింది. 

5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ
వీసాల జారీపై ఈ ఏడాది వరకు నిషేధం పొడిగిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన తర్వాత శ్వేతసౌధం అధికారి మీడియాతో మాట్లాడారు. హెచ్‌–1బీ, ఎల్‌1 వీసాలపై తాత్కాలిక నిషేధంతో అమెరికాలో 5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ కానున్నాయని అంచనాలున్నట్టుగా చెప్పారు. ఆ ఉద్యోగాలన్నింటినీ అమెరికన్లతో భర్తీ చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ట్రంప్‌ దృష్టి సారించినట్టు ఆయన వెల్లడించారు. 

లాటరీ విధానం రద్దుకు సన్నాహాలు
ఇన్నాళ్లూ హెచ్‌1బీ వీసాలను లాటరీ విధానం ద్వారా ఇచ్చేవారని, ఇకపై ఉద్యోగాల్లో తీసుకునే విదేశీ పనివారి నైపుణ్యం, వారికిచ్చే వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తారని వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు. ‘ప్రతీ ఏడాది హెచ్‌–1బీ వీసాలు 85 వేల వరకు జారీ చేస్తాం. కానీ దరఖాస్తులు 2 నుంచి 3 లక్షలు వస్తాయి. ఇకపై లాటరీ విధానాన్ని రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మంజూరు చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. అంటే అత్యధిక వేతనాలు లభించే 85 వేల మందికి మంజూరు చేస్తాం. దీనివల్ల నైపుణ్యం కలిగిన వారికే పనిచేసే అవకాశం వస్తుంది’అని ఆ అధికారి వివరించారు. 

ట్రంప్‌ నిర్ణయంపై అమెరికన్లలో హర్షం
ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. మేరీల్యాండ్‌లో వాషింగ్టన్‌ పోస్ట్‌ యూనివర్సిటీ నిర్వహించిన పోల్‌లో 65శాతం ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. కరోనా వైరస్‌ విసిరిన సవాళ్లతో వలసదారుల నుంచి తమ ఉపాధికి ముప్పు ఉంటుందని 81శాతం అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. 

భారతీయులపై ప్రభావం ఎంత ? 
అమెరికాలో ఇప్పటికే వివిధ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ నిషేధం ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే కొత్తగా అమెరికా వెళ్లాలనుకునే వారిపై దీని ప్రభావం చూపిస్తుంది. ప్రతీ ఏడాది మంజూరు చేసే హెచ్‌–1బీ వీసాలు 85 వేలకు వీసాలకు గాను 70శాతం మంది భారతీయులే. వారందరూ ఇక ఏడాది పాటు వేచి చూడాలి. అయితే కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా ఇప్పట్లో ఎవరూ విదేశీ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎన్నో టెక్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తోనే పనులు జరిపించుకుంటున్నాయి. అందువల్ల అందరూ అనుకునేటంత నష్టం ఉండదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 

అమెరికా టెక్‌ కంపెనీల్లో ఆందోళన
అమెరికాలో వృత్తి నిపుణులకు భారీగా వేతనాలు చెల్లించాలి. విదేశీయులైతే తక్కువ వేతనాలకు వస్తారన్న కారణంగా ఎన్నో బహుళ జాతీయ కంపెనీలు అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌ , అమెజాన్, ఫేస్‌బుక్‌ వంటి ఐటీ దిగ్గజాలకు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఎదురు దెబ్బ తగలనుంది. హెచ్‌–1బీ వీసాలను అత్యధికంగా స్పాన్సర్‌ చేస్తూ విదేశీ వర్కర్ల సేవల్ని ఎక్కువగా ఈ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. ఇక అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్‌ వంటి కంపెనీలూ కూడా తక్కువ వేతనాలకే భారతీయ టెక్కీలను ఉద్యోగాల్లోకి తీసుకొని లబ్ధి పొందుతున్నాయి. తాజా ఉత్తర్వులతో టెక్‌ కంపెనీలు విదేశీ వర్కర్లను పనిలోకి తీసుకోలేవు. ఆ పని చేసే సామర్థ్యం అమెరికన్లకు లేకపోవడం, వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఇష్టపడకపోవడం కూడా కంపెనీ యజమానుల్లో ఆందోళన పెంచుతోంది.

సుందర్‌ పిచాయ్‌ అసంతృప్తి 
ట్రంప్‌ నిర్ణయంపై గూగుల్‌ సీఈవో, ఇండియన్‌ అమెరికన్‌ సుందర్‌ పిచాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల పక్షానే తాను ఉంటానని అవకాశాలు అందరికీ ఇవ్వాలన్నారు. ‘అమెరికా ఆర్థిక విజయాలకు వలస విధానమే ఎంతో తోడ్పడింది. టెక్నాలజీలో గ్లోబల్‌ లీడర్‌గా అమెరికాను నిలిపిందంటే, గూగుల్‌ ఇప్పుడు ఇలా నిలిచిందింటే ఆ విధానమే కారణం’అని పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. 

న్యాయస్థానంలో నిలబడుతుందా? 
ట్రంప్‌ కొత్త ఉత్తర్వులపై అమెరికన్‌ కంపెనీల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అమెరికా ఫస్ట్‌ రికవరీ పేరుతో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలని అధ్యక్షుడు భావిస్తున్నప్పటికీ ఈ వీసాలపై నిషేధం పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమెరికా వలస విధానాలను వ్యతిరేకంగా ఉందని ఇమ్మిగ్రేషన్‌ నిపుణుల అభిప్రాయంగా ఉంది. న్యూయార్క్‌కి చెందిన ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ సంస్థ వ్యవస్థాపకుడు సైరస్‌ మెహతా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం ఉందన్నారు. ‘ట్రంప్‌ ప్రకటన ఇమ్మిగ్రేషన్, నేషనాలటీ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకం. ఎవరైనా కోర్టుకెళితే దీనిని నిలిపివేస్తారు. ఇలా నిషేధం పొడిగించడం వల్ల అమెరికాలో కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఈ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారంతా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎంతో సాయంగా ఉన్నారు’అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు