మొదటిసారిగా మాస్క్‌తో ట్రంప్‌

13 Jul, 2020 03:33 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు మాస్క్‌తో కనిపించారు. అమెరికాలో కరోనా వైరస్‌ ప్రబలంగా ఉన్న సమయంలోనూ మాస్క్‌ ధరించని ట్రంప్‌..శనివారం వాషింగ్టన్‌ సమీపంలోని వాల్టర్‌ రీడ్‌ మిలటరీ మెడికల్‌ సెంటర్‌ సందర్శన సమయంలో మాత్రం వైద్యాధికారుల సూచనల మేరకు మాస్క్‌ పెట్టుకున్నారు.  ఈ ఆస్పత్రిలో క్షతగాత్రులైన సైనిక సిబ్బంది, కోవిడ్‌–19 ఆస్పత్రుల్లో సేవలందించే సిబ్బందికి వైద్యం అందిస్తున్నారు. దేశంలో కోవిడ్‌–19 వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అధికార రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహా అందరూ మాస్క్‌ ధరిస్తున్నారు.

ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, మీడియా సమావేశాల్లో పాల్గొంటున్న ట్రంప్‌ మాత్రం మాస్క్‌ ధరించడం లేదు. దీనిపై ట్రంప్‌ సన్నిహితుడొకరు మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మాస్క్‌ ధరిస్తే ప్రజలు తనను బలహీనుడిగా భావిస్తారని ట్రంప్‌ అనుకుంటున్నారు. ప్రజారోగ్య సంక్షోభం బదులుగా దేశం ఆర్థికంగా నిలదొక్కుకుంటోందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లాలంటే అలా చేయక తప్పదని భావిస్తున్నారు’అని తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ మాస్క్‌ ధరించడంపైనా ట్రంప్‌ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.  డెమో క్రటిక్‌ పార్టీ ఎన్నికల ర్యాలీలతో పోలిస్తే రిపబ్లికన్‌ పార్టీ ర్యాలీల్లో చాలా తక్కువ మంది మాస్క్‌లు ధరిస్తుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు