మాస్క్‌తో అధ్యక్షుడు

12 Jul, 2020 10:47 IST|Sakshi

నలుపు రంగు మాస్క్‌ ధరించిన ట్రంప్‌

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ అమెరికాలో వేగంగా విజృంభిస్తున్న బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా మాస్క్‌తో కనిపించారు. ట్రంప్‌ శనివారం మేరీలాండ్‌లో ఓ సైనిక ఆస్పత్రిని సందర్శించిన సందర్భంలో మాస్క్‌ ధరించారు. సైనిక వైద్య కేంద్రంలో గాయపడిన సైనికులను, కరోనాతో ముందుండి పోరాడే ఆరోగ్య కార్యకర్తలను కలుసుకున్నారు. ‘నేను మాస్క్‌ను తప్పక ధరించాలి...పెద్దసంఖ్యలో సైనికులు, రోగులను కలిసేందుకు ఆస్పత్రిని సందర్శించినప్పుడు మాస్క్‌ అవసరం అనివార్యం..మహమ్మారిని అధిగమించే క్రమంలో మాస్క్‌ను ధరించడం గొప్ప విషయ’మని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మాస్క్‌లకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, మాస్క్‌ వేసుకునేందుకు తగిన సమయం, సందర్భం అవసరమని తాను భావిస్తానని చెప్పారు.

మెడికల్‌ సెంటర్‌లో మాస్క్‌లు ధరించిన సిబ్బంది వెంట రాగా, నలుపు రంగు మాస్క్‌ను ధరించి ట్రంప్‌ కనిపించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తర్వాత బహిరంగ ప్రదేశంలో మాస్క్‌తో ట్రంప్‌ కనిపించడం ఇదే తొలిసారి. కాగా మాస్క్‌తో విలేకరులను ఉద్దేశించి మాట్లాడేందుకు ట్రంప్‌ నిరాకరించారు. ట్రంప్‌ మాస్క్‌ ధరించడంపై మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ ప్రచారకర్తలు స్పందించారు. అమెరికన్లను మాస్క్‌ ధరించకుండా నిరాశపరిచేలా ట్రంప్‌ చాలా సమయం వృధా చేశారని, బిడెన్‌ మాత్రం ఆరంభం నుంచే మంచి సంప్రదాయం నెలకొల్పారని వ్యాఖ్యానించారు.చదవండి : ‘వైట్‌ హౌజ్‌‌లో హిస్టరీ బుక్స్‌ లేవా?’

మరిన్ని వార్తలు