జై కొడతారా..? నై అంటారా?

20 Dec, 2016 00:57 IST|Sakshi
జై కొడతారా..? నై అంటారా?

అమెరికా అధ్యక్ష ‘అసలు’ ఎన్నిక 19న

- కీలకంగా మారిన ఎలక్టోరల్‌ కాలేజీ భేటీ
- ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు సొంత పార్టీ సభ్యులు
- ఓటింగ్‌లో ఎటు మొగ్గుతారన్న దానిపై ఉత్కంఠ
- హిల్లరీ, ట్రంప్‌ కాకుండా మరో అభ్యర్థికి మద్దతిస్తున్న ‘హామిల్టన్‌’ బృందం


అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 8న జరిగింది. ఫలితం 24 గంటల్లోపే వచ్చింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. కానీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 48 రాష్ట్రాలు (మెయిన్, నెబ్రాస్కా పద్ధతి వేరు), రాజధాని వాషింగ్టన్‌ డీసీ నుంచి ఎన్నికైన 538 మంది ఎలక్టోరల్‌ కాలేజీ ఎలక్టర్లు (ఓటర్లు లేదా ప్రతినిధులు) 19వ తేదీన తమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశమై అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఎలక్టర్లలో 306 మంది రిపబ్లికన్లు (మెజారిటీకి అవసరమైన కనీస  ఓట్లు 270). 232 మంది డెమోక్రాట్లు. రెండు పక్షాల ఎలక్టర్లు ఎవరి అభ్యర్థికి వారు ఓట్లేసుకుంటారు. కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేసే జనవరి 20కి రెండు వారాల ముందు అంటే.. జనవరి 6న ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను లెక్కించి గెలిచిన అభ్యర్థిని ప్రకటించడం కేవలం లాంఛనం.

రెండు వారాల ముందు సంచలనం
ముందుగా ప్రమాణం చేసినట్టు తమ అభ్యర్థి ట్రంప్‌కు ఓటు వేయబోనని టెక్సాస్‌ రిపబ్లికన్‌ ఎలక్టర్‌ క్రిస్టఫర్‌ సప్రూన్‌ ప్రకటించడంతో సంచలనం మొదలైంది. తమ అభ్యర్థులకు ఓటేయబోమని, ట్రంప్‌కు బదులు ఏకాభిప్రాయంతో ఓ రిపబ్లికన్‌ను ఎంపిక చేసుకుని ఆయనకే ఓటేస్తామని పలువురు ఎలక్టర్లు (రెండు పార్టీలవారు) ఈ నెల ఐదు నాటికే ప్రకటించారు. దీంతో 19న జరిగే ఓటింగ్‌పై ఆసక్తి పెరిగింది. ట్రంప్‌కు ఓటేయడానికి ఇష్టపడని మరో టెక్సాస్‌ ఎలక్టర్‌ ఆర్ట్‌ సిస్నరాస్‌(రి) తన సభ్యత్వానికే రాజీనామా ఇచ్చారు. అలాగే ట్రంప్‌కు ఓటేయనని బహిరంగంగానే చెప్పిన జార్జియా ఎలక్టర్‌ బావ్‌కీ వూతో బలవంతంగా సభ్యత్వానికి రాజీనామా చేయించారు. ఇలా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయని ఎలక్టర్లను ‘ఫెయిత్‌లెస్‌’ ఓటర్లని (నమ్మకద్రోహులు) పిలవడం అమెరికా సంప్రదాయం. పైన చెప్పినట్లు ఇలాంటి విశ్వాసఘాతుకానికి పాల్పడే అవకాశమున్న ఎలక్టర్లు రెండు పార్టీల్లో కలిపి ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలియదు.

మాట తప్పితే సభ్యత్వం రద్దు
సొంత పార్టీ అభ్యర్థులకే ఓటేయాలనే చట్టాలున్న రాష్ట్రాల్లో మాట తప్పి ఓటేసే ఎలక్టర్లపై వేయి డాలర్ల జరిమానా విధిస్తారు. అవసరమనుకుంటే వారి స్థానంలో వేరే సభ్యులను నియమించే వీలును చట్టాలు కల్పిస్తున్నాయి. అయితే ఇంత వరకూ ఇలా ఓటేసిన ఎవరిపైనా పెనాల్టీ వేయలేదు. ఏ సభ్యుడినీ ప్రాసిక్యూట్‌ చేయలేదు. 2004 ఎలక్టర్ల పోలింగ్‌లో ఓ డెమొక్రాట్‌ ప్రతినిధి పొరపాటున అధ్యక్ష ఓటును అభ్యర్థి జాన్‌ కెరీకి కాకుండా.. ఉపాధ్యక్ష నామినీ జాన్‌ ఎడ్వర్డ్స్‌కు వేశారు.

పాపులర్‌ ఓట్లే కీలకం
అధ్యక్ష ఎన్నికల్లో మొదట్నించీ విజేతను ఎల క్టోరల్‌ కాలేజీ ఓటర్లే నిర్ణయిస్తున్నారు. 2016 ఎ న్నికలు సహా ఐదుసార్లు మాత్రమే గెలిచిన అధ్యక్ష అభ్యర్థి కన్నా ఓడిన పార్టీ నేత ఎక్కువ ప్రజా ఓట్లు సంపాదించారు. 2000 ఎన్నికల్లో అల్‌ గోర్‌(డెమోక్రాట్‌)కు జార్జి డబ్ల్యూ బుష్‌ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంతకు మూడుసార్లు(1824, 1876, 1888) అత్యధిక ప్రజల ఓట్లు పొందిన అభ్యర్థులు ఓడిపోయా రు. మొన్నటి నవంబర్‌ ఎన్నికల్లో ట్రంప్‌ కన్నా దాదాపు 28 లక్షల ఓట్లు ఎక్కువ పొందిన హిల్లరీ పై నలుగురి జాబితాలో చేరారు.

అత్యంత విధేయులే ఎలక్టర్లు!
పార్టీ తరఫున రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే ఎలక్టర్లుగా అత్యంత విధేయులైన సభ్యులనే ఎంపిక చేస్తారు. వారికి విభిన్న నేపథ్యాలుంటాయి. వయసులో తేడాలూ ఉంటాయి. ఈసారి న్యూయార్క్‌ డెమొక్రాట్‌ ఎలక్టర్‌గా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ (70) ఎన్నికవగా, వాషింగ్టన్‌ స్టేట్‌ నుంచి 19 ఏళ్ల లేవీ గుయేరా ఎంపికయ్యారు.

‘హామిల్టన్‌ ఎలక్టర్స్‌’ ఎవరు?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరు కున్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్యంగా గెలిచిన సంగతి ముందే తెలిసినప్పటికీ.. ఎల క్టోరల్‌ కాలేజీ సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకునే లాంఛన ప్రక్రియ ఈ నెల 19న జరగనుంది. అయితే.. పాపులర్‌ ఓటులో హిల్లరీ క్లింటన్‌కు భారీ మెజారిటీ రావడం.. ట్రంప్‌ను అధ్యక్షుడిగా అంగీకరించబోమంటూ పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరస నలు చెలరేగడం.. మూడు రాష్ట్రాల్లో రీకౌంటింగ్‌ నిర్వహించడం.. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ రిపబ్లికన్‌ పార్టీ ఎలక్టోరల్‌ సభ్యులకు విజ్ఞప్తులు వెల్లువెత్తడం వంటి పరిణామాల నే పథ్యంలో.. సోమవారం జరగబోయే ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నిక ఏదైనా అనూహ్య మలుపు తిరుగు తుందా అన్న ఉత్కంఠ రేకెత్తిస్తోంది.                 

ట్రంప్, హిల్లరీకి కాకుండా ఏకాభిప్రాయంతో నిర్ణయించిన రిపబ్లికన్‌ అభ్యర్థికి ఓటేయాలని తీర్మానించుకున్న ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు కొందరు తమను ‘హామిల్టన్‌ ఎలక్టర్స్‌’ అని పిలు చుకుంటున్నారు. అమెరికా వ్యవస్థాపకుల్లో ఒకరు, దేశ రెండో అధ్యక్షుడు అలెగ్జాండర్‌ హామిల్టన్‌ పేరుతో ఈ ‘తిరుగుబాటు’ ఎలక్టర్లు రంగంలోకి దిగారు. దీనికి కారణం లేకపోలేదు. ఎలక్టోరల్‌ కాలేజీ ప్రధాన లక్ష్యాన్ని హామిల్టన్‌ వివరించారు. అర్హత లేని అభ్యర్థి లేదా విదేశీ శక్తుల ప్రభావం ఉన్న అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికగాకుండా నివారించే రక్షణ వ్యవస్థగా ఈ కాలేజీ పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. ఓహాయో రాష్ట్ర గవర్నర్‌ జాన్‌ కేసిక్‌(రి)కు ఓటేయాలని హామిల్టన్‌ ఎలక్టర్లు నిర్ణయించుకున్నారు.

ఎలక్టర్ల ఓట్లు ఎలా?
అధ్యక్ష ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు పోలింగ్‌కు ముందే ఈ ఎలక్టోరల్‌ కాలేజీ ఎలక్టర్లను ఎంపిక చేస్తాయి. ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికే ఓటేస్తామని ఈ ఎలక్టర్లు మొదట ప్రమాణం చేస్తారు. 227 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ ఈ ఎలక్టర్లు 99 శాతానికి పైగా తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లేశారు. అలాగే ఓటు వేయాలని 29 రాష్టాల చట్టాలు చెబుతున్నాయి. 14 రాష్ట్రాల్లో మాత్రం ప్రమాణం చేసిన అభ్యర్థికి ఓటేయకపోయినా ఇబ్బంది ఉండదు. ప్రధాన అధ్యక్ష అభ్యర్థుల పేర్లు కాకుండా ఇతరు పేర్లు కూడా రాసి ఓటేయవచ్చు. ప్రతి ఎలక్టరూ రెండు కాగితాలపై అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థుల పేర్లు రాయాల్సి ఉంటుంది. ఇదీ రివాజు. ఓటేసిన తర్వాత ఈ 538 మంది సభ్యత్వం దానంతటదే రద్దవుతుంది.

ఫలితం మారుతుందా?
అధ్యక్షుడిగా అర్హత లేదని కొందరు, అత్యధిక ప్రజల ఓట్లు తెచ్చుకోలే దని మరికొందరు ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా.. రిపబ్లికన్‌ ఎలక్ట ర్లలో 38 మంది ఆయనకు ఓటేయకపోతే తప్ప ఆయనే విజేత అవుతారనడంలో సందేహం లేదు. అధ్యక్ష ఎన్నికలను పరోక్ష పద్ధతి నుంచి ప్రత్యక్ష విధానానికి (పాపుల ర్‌ ఓటు ద్వారా) మార్చాలనే వాదనకు కూడా ఈ వివాదం వల్ల ప్రచారం లభిస్తోంది.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు