హిల్లరీ, ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ!

6 Apr, 2016 09:46 IST|Sakshi
హిల్లరీ, ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ!

వాషింగ్టన్: డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజలో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన కీలకమైన విస్కాన్సిన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో హిల్లరీ, ట్రంప్ ప్రత్యర్థులు బెర్నీ సాండర్స్, టెడ్ క్రూజ్ ఘన విజయాలు సాధించారు. తద్వారా రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో దూసుకుపోతున్న ట్రంప్, హిల్లరీలకు గట్టి సందేశమే పంపారు. అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తాము తప్పుకోలేదనే విషయాన్ని చాటారు.

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇప్పటివరకు ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు టెక్సాస్ సెనేటర్ అయిన క్రూజ్ గట్టి దెబ్బ కొట్టారు. కెనడా సరిహద్దుల్లో ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రైమరీ రేసులో క్రూజ్ 49శాతం ఓట్లు సాధించి ముందంజలో ఉండగా.. ట్రంప్ కేవలం 35శాతం ఓట్లు మాత్రమే సాధించాడు. ఈ రేసులో ఉన్న మరో పోటీదారు ఓహి గవర్నర్ జాన్ కసిష్ 14శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. తాజా ప్రైమరీ ఫలితాలు.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కోసం తహతహలాడుతున్న ట్రంప్ తలరాతను తారుమారు చేసే అవకాశముందని భావిస్తున్నారు. విస్కాన్సిన్ లో బిలియనీర్ ట్రంప్ విజయం ఖాయమని, దీంతో రిపబ్లికన్ నామినేషన్ కోసం కావాల్సిన 1237 మంది డెలిగేట్స్ మద్దతు ఆయనకు లభించినట్టు అవుతుందని అంతా భావించారు. అయితే ఇక్కడ ఓటమితో ఆయనకు మెజారిటీ డెలిగేట్స్ మద్దతు లభిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇక డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులోనూ ప్రధాన పోటీదారు హిల్లరీ క్లింటన్ కు ఎదురుదెబ్బ తగిలింది. విస్కాన్సిన్ ప్రైమరీలో వెర్మంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ కు 57శాతం ఓట్లు లభించగా.. హిల్లరీ కేవలం 43శాతం ఓట్లు మాత్రమే సాధించి వెనుకబడ్డారు. అయితే, త్వరలో జరుగనున్న న్యూయార్క్, పెన్సిల్వేనియా ప్రైమరీల్లో హిల్లరీ విజయావకాశాలు మెండుగా ఉండటంతో డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ ఆమెనే వరించే అవకాశముందని వినిపిస్తోంది.
 

మరిన్ని వార్తలు