అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు!

24 Jun, 2020 16:16 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో మంగళవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా  కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నా బుధవారం ఒక్కసారిగా 34,700 కొత్త కరోనా కేసులు బయటపడటంతో అమెరికా ఇంకా కరోనా కోరల్లో ఉన్నట్లే అర్థం అవుతోంది. ఇప్పటి వరకు కేవలం ఏప్రిల్‌ 9, ఏ‍ప్రిల్‌ 24 తేదీల్లో మాత్రమే 36,400 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మంగళవారం నాడే అత్యధిక కేసులు నమోదుకాబడ్డాయి. (‘కరోనా పరీక్షలు తగ్గించమనలేదు’)

హాట్‌ స్పాట్‌లుగా  ఉన్న న్యూయార్క్‌, న్యూజెర్సీలలో  కరోనాకేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అయితే దక్షిణ అమెరికా, పశ్చిమ అమెరికా ప్రాంతాలే ఈ వైరస్‌ దాటికి విలవిలలాడుతున్నాయి. అరిజోనా, కాలిఫోర్నియా, మిస్సిసిపి, నెవడా, టెక్సాస్‌లో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 2,424,493 కరోనా ​కేసులు నమోదు కాగా 123,476 మంది మహమ్మారి బారిన పడి మరణించారు.  కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెక్సికోలో కరోనా పరీక్షలు తక్కువ చేస్తున్నప్పటికీ 6,200 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కూడా ప్రతి రోజు 15000 పై చిలుకు కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. (ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు)

మరిన్ని వార్తలు