‘ఉగ్ర మూకల విధ్వంసానికి పాక్‌దే బాధ్యత’

23 Oct, 2019 09:24 IST|Sakshi

వాషింగ్టన్‌ : లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు పాకిస్తాన్‌దే బాధ్యతని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. సిమ్లా ఒప్పందంలో సూచించిన తరహాలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య నేరుగా చర్చలు జరిపితే మేలని వ్యాఖ్యానించింది. 1972 సిమ్లా ఒప్పందంలో పేర్కొన్న మాదిరిగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య చర్చలు జరిగితే ఉద్రిక్తతలను నివారించవచ్చని అమెరికా భావిస్తోందని అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ నుంచి కశ్మీర్‌లో హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులు కశ్మీరీలకు, పాకిస్తాన్‌కు కూడా శత్రువులేనని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ప్రకటనను అమెరికా స్వాగతిస్తుందని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ఆశ్రయం పొందుతున్న లష్కరే, జైషే వంటి ఉగ్ర మూకలు వాస్తవాధీన రేఖ వెంబడి హింసకు తెగబడుతున్నాయని, వీరి చర్యలకు పాకిస్తాన్‌ బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. తమ భూభాగంలో ఉగ్రవాదుల చర్యలను పాకిస్తాన్‌ నిరోధించడంపైనే భారత​-పాకిస్తాన్‌ల మధ్య నిర్మాణాత్మక చర్యలకు పునాదిలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేలా చూసేందుకు అధ్యక్షుడు ట్రంప్‌, విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భారత్‌, పాక్‌ దేశాధినేతలతో మాట్లాడారని వెల్స్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు