1.4 కోట్ల మందిపై నిఘా!

1 Apr, 2018 02:53 IST|Sakshi

అమెరికా ‘సోషల్‌ మీడియా’ వివరాల నిబంధనపై విమర్శలు  

వాషింగ్టన్‌: నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాపై అమెరికా వెళ్లాలనుకునేవారు దరఖాస్తు సమయంలో గత ఐదేళ్ల సోషల్‌ మీడియా, ఫోన్, ఈ మెయిల్‌ వివరాలు వెల్లడించాలన్న ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల కోసం ఏడాదికి దాదాపు 1.47 కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. టూరిజం, వైద్య చికిత్స, వ్యాపారం కోసం జారీచేసే వీసాలు, హెచ్‌–1బీ, స్టూడెంట్‌ వీసాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. అమెరికా విదేశాంగ శాఖ రూపొందిస్తున్న కొత్త నియమావళి ప్రకారం వీరంతా తమ వ్యక్తిగత వివరాల్ని అమెరికాకు బహిర్గతం చేయడం తప్పనిసరి.

సోషల్‌ మీడియా వివరాలు, పాస్‌పోర్ట్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లు, విదేశీ ప్రయాణాల వివరాలూ చెప్పాలి.ఇమిగ్రెంట్‌ వీసాల కోసం దరఖాస్తు చేసేవారిని సోషల్‌ మీడియా వివరాల్ని అడుగుతామని, ఈ నిర్ణయం ఏడాదికి 7 లక్షలపై ప్రభావం చూపనుందని గత సెప్టెంబర్‌లో అమెరికా వెల్లడించింది.

అయితే ఆ ప్రతిపాదనను మరింత విస్తరించి 1.4 కోట్ల నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా దరఖాస్తుదారులకు వర్తింపచేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం దరఖాస్తుదారుడు మొత్తం 20 సోషల్‌ మీడియా ఫ్లాట్‌పాంల ఖాతాల వివరాలు తెలపాలి. వాటిలో అమెరికా నుంచి నడుస్తున్న ఫేస్‌బుక్, ఫ్లికర్, గూగుల్‌ ప్లస్, ఇన్‌స్ట్రాగాం, లింక్డిన్, మై స్పేస్, పింట్రెస్ట్, రెడిట్, టంబ్లర్, ట్విటర్, వైన్, యూట్యూబ్‌లు ఉండగా.. చైనా సైట్లు డౌబన్, క్యూక్యూ, సైనా వైబో, టెన్సెంట్‌ వైబో, యుకు, రష్యా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లు వీకే, ట్వూలు ఉన్నాయి.

క్షుణ్నంగా తనిఖీలు..
క్షుణ్నంగా తనిఖీ చేశాకే అమెరికాలోకి అనుమతిస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక.. గతేడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని కాన్సులేట్‌ కార్యాలయాల్లో దరఖాస్తుల తనిఖీని మరింత కట్టుదిట్టం చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇప్పుడు వ్యాపార అవసరాలతో పాటు టూరిస్ట్‌ పర్యటనకు అమెరికా వెళ్లాలనుకునే వారికి కూడా ఈ తనిఖీల్ని కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నిర్ణయం భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికోలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా లేకుండా అమెరికాలోకి ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న 40 దేశాలపై ఈ నిబంధనలు ఎలాంటి ప్రభావం చూపబోవు. వీటిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలున్నాయి.

నిష్ఫల ప్రయత్నం..
తాజా నిబంధనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది మంది వీసా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా వివరాలు సేకరించాలనుకోవడం నిష్ఫల, సమస్యలు సృష్టించే ప్రయత్నమని అమెరికన్‌  సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ డైరెక్టర్‌ హినా షంషీ అన్నారు. ఇది వ్యక్తిగత అంశాల్లోకి చొరబడడమే కాకుండా అర్థరహిత నిర్ణయమని డ్రెక్సెల్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ లా ప్రొఫెసర్‌ అనిల్‌ ఖాల్హన్‌ చెప్పారు. ప్రైవేటు ఖాతాల సమాచారం ఇవ్వాలని బలవంతం చేయడానికి తాము వ్యతిరేకమని ఇంతకు ముందే చెప్పామని అందులో ఎలాంటి మార్పులేదని ఫేస్‌బుక్‌ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు