‘కశ్మీర్‌ పునరుద్ధరణకు రోడ్‌మ్యాప్‌’

25 Oct, 2019 08:04 IST|Sakshi

వాషింగ్టన్‌ : జమ్ము కశ్మీర్‌లో రాజకీయ, ఆర్థిక సాధారణ పరిస్థితి పునరుద్ధరించేందుకు రోడ్‌మ్యాప్‌ ప్రకటించాలని, రాజకీయ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ విడుదల చేయాలని భారత్‌ను అమెరికా కోరింది. ఇక తమ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలని పాకిస్తాన్‌కు సూచించింది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం అనంతరం పెద్దసంఖ్యలో వేర్పాటువాద నేతలను ముందస్తు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో రాజకీయార్థిక సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు రోడ్‌మ్యాప్‌ అవసరమని అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అమలవుతున్న నియంత్రణలతో కశ్మీర్‌లో 80 లక్షల మంది స్ధానికులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న తీరు తమకు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. భద్రతా పరమైన కారణాలతో కశ్మీర్‌లో వార్తలను కవర్‌ చేసే జర్నలిస్టులు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు