పాక్‌ కోర్టు తీర్పు.. మండిపడ్డ అమెరికా!

3 Apr, 2020 12:58 IST|Sakshi

ఇస్లామాబాద్‌/వాషింగ్టన్‌: అమెరికా జర్నలిస్టు డేనియల్‌ పెరల్‌ అపహరణ, హత్య కేసులో దోషులను పాకిస్తాన్‌ కోర్టు విడుదల చేయడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పాశవికంగా డేనియల్‌ను హతమార్చిన వారికి విముక్తి కలిగించడం హేయమైన చర్య అని మండిపడింది. ఈ మేరకు‘‘ఇది బాధితులను అవమానించడమే. ఉగ్రవాదం ప్రతీ చోటా ఉంది’’అని దక్షిణాసియా వ్యవహారాల అమెరికా దౌత్యవేత్త ట్వీట్‌ చేశారు. కాగా అమెరికా వార్తా పత్రిక ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లో డేనియల్‌(38) రిపోర్టర్‌గా పని చేసేవారు.

ఈ క్రమంలో 2001 సెప్టెంబరు 11న అమెరికాపై ఉగ్రవాదులు జరిపిన దాడులకు సంబంధించి ఆయన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఆయన కదలికలపై నిఘా వేసిన ఉగ్రవాది అహ్మద్‌ ఒమర్‌ సయీద్‌ షేక్‌ మరో ముగ్గురితో కలిసి 2002లో డేనియల్‌ను కిడ్నాప్‌ చేశాడు. బ్రిటన్‌లో జన్మించిన సయీద్‌... డేనియల్‌ తల నరుకుతూ.. ఆ క్రూర చర్యను వీడియో రూపంలో విడుదల చేయడంతో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. 

ఈ నేపథ్యంలో పాక్‌లో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణ అనంతరం స్థానిక కోర్టు సయీద్‌కు మరణ శిక్ష విధించడంతో పాటుగా అతడికి సహకరించిన వారికి కఠిన కారాగార శిక్ష వేసింది. ఈ క్రమంలో గురువారం ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టిన సింధ్‌ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నలుగురు దోషులను విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. నిందితులు నేరానికి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలు సమర్పించని కారణంగా ఈ మేరకు తీర్పు వెలువరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో కోర్టు తీర్పును తప్పుబట్టిన అమెరికా.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇక డేనియల్‌కు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. కాగా ఈ విషయంపై స్పందించిన పాక్‌ విదేశాంగ కార్యాలయం... తీర్పుపై ఎగువ కోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ఇదిలా ఉండగా... స్థానిక లాయర్‌ ఒకరు మాట్లాడుతూ.. చట్టపరంగా సయీద్‌ విడుదలను అడ్డుకునే మార్గం లేదని స్పష్టం చేశారు. కాగా కశ్మీర్‌లో వేర్పాటువాదులకు సహకరించడం, విదేశీ టూరిస్టులను కిడ్నాప్‌ చేశాడన్న ఆరోపణలతో సయీద్‌ను 1990లో భారత్‌లో అరెస్టు చేశారు. ఈ క్రమంలో 1999లో ఉగ్రవాదులు భారత్ విమానాన్ని హైజాక్‌ చేయగా... తాలిబన్లతో జరిగిన చర్చల నేపథ్యంలో అతడిని విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు