‘ట్రావెల్‌ బ్యాన్‌’కు అనుమతి

27 Jun, 2017 00:42 IST|Sakshi
‘ట్రావెల్‌ బ్యాన్‌’కు అనుమతి

► ట్రంప్‌ నిషేధ ఉత్తర్వులపై స్టే ఎత్తేసిన అమెరికా సుప్రీంకోర్టు
► ప్రవేశ అర్హత ఉంటే అనుమతించాలని షరతు


వాషింగ్టన్‌: ప్రయాణ నిషేధ ఉత్తర్వుల(ట్రావెల్‌ బ్యాన్‌) అమలులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్షిక విజయం సాధించారు. ఆరు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై పాక్షిక నిషేధానికి అనుమతిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.. జనవరిలో ట్రంప్‌ జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల్ని కింది కోర్టులు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద ఉత్తర్వుల్ని అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తిరిగి పునరుద్ధరిస్తూ... అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎవరు అర్హులన్న విషయంలో కొన్ని మార్గదర్శకాల్ని నిర్దేశించింది.

అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలతో చట్టబద్దమైన సంబంధాలుంటే వారు దేశంలో ప్రవేశించేందుకు అర్హులని స్పష్టం చేసిం ది. అలాగే చెల్లుబాటయ్యే వీసా ఉన్న వారిని కూడా అనుమతించాల్సిందేనని పేర్కొంది. అక్టోబర్‌లో కేసు పూర్తి స్థాయి విచారణ వరకూ ఈ ఉత్తర్వులు కొనసాగుతాయి. కోర్టు ఉత్తర్వులు వెలువడ్డ 72 గంటల అనంతరం(జూన్‌ 29 నుంచి) నిషేధ ఉత్తర్వుల్ని అమలు చేస్తామని ట్రంప్‌ ఇంతకముందే పేర్కొన్నారు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్‌ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే 120 రోజుల పాటు శరణార్థులు అమెరికాలో ప్రవేశించడానికి వీలుండదు. అలాగే సిరియన్‌ శరణార్థులపై నిరవధికంగా నిషేధం కొనసాగుతుంది. అయితే అమెరికాలోకి ప్రవేశంపై ఏవరైనా కోర్టులో దావా వేస్తే వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని ఆదేశించింది. అమెరికా భద్రత కోణంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సంపూర్ణ విజయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు