చైనీస్‌ ఎయిర్‌లైన్స్‌పై సస్పెన్షన్‌.. జూన్‌ 16 నుంచి..

3 Jun, 2020 21:18 IST|Sakshi

వాషింగ్టన్‌: దేశంలోకి చైనా ఎయిర్‌లైన్స్‌ విమానాల రాకపోకలపై అగ్రరాజ్యం అమెరికా సస్పెన్షన్‌ విధించనున్నట్లు తెలిపింది. జూన్‌ 16 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. తద్వారా కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలను అనుమతించబోమన్న డ్రాగన్‌కు కౌంటర్‌ ఇచ్చింది. ఈ మేరకు అమెరికా రవాణా విభాగం..‘‘జూన్‌ 1 నుంచి ప్యాసింజర్‌ సర్వీసులు ప్రారంభిస్తామన్న యూఎస్‌ క్యారియర్ల విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది. తద్వారా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ విషయంపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.(జార్జ్ ‌ఫ్లాయిడ్‌ నిరసనలు.. ట్రంప్‌కు షాక్‌)

ఇక ఒకవేళ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గనుక అనుమతించినట్లయితే జూన్‌ 16 కంటే ముందే సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా... కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే మహమ్మారి లీకైందనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్‌ డ్రాగన్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల నేతలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. కాగా కోవిడ్‌ ధాటికి ఇప్పటికే అమెరికాలో లక్ష మందికి పైగా మృత్యువాత పడ్డారు. 1.87 మిలియన్ల మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు నాలుగున్నర లక్షల మంది కోలుకున్నారు.(ఊచకోత; చైనా క్షమాపణ చెప్పాల్సిందే: తైవాన్‌)

మరిన్ని వార్తలు