సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు అమెరికాలో న్యాయం

10 Mar, 2016 18:02 IST|Sakshi
సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు అమెరికాలో న్యాయం

న్యూయార్క్ : ఉగ్రవాది అంటూ దూషణలతో పాటు దాడులకు గురయిన భారతీయ సంతతికి చెందిన ఓ సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. గతేడాది సిక్కు జాతీయుడిని దూషించి అతడిపై ముష్టియుద్ధానికి దిగిన కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది.  9/11 దాడుల నేపథ్యంలో సెప్టెంబర్ 8న ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ కొందరు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇందర్జిత్ సింగ్ ముక్కర్ చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ కేసు ప్రస్తుతం విచారణకు రాగా నిందితుడికి శిక్ష పడిందని చికాగో పోలీసులు తెలిపారు. నిందితుడి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అతడు ఇంకా టీనేజీలోనే ఉన్నందున జువెనైల్ హోమ్ కు తరలించినట్లు వివరించారు. సిక్కు కమ్యూనిటీకి 200 గంటల పాటు సేవ చేయడంతో పాటు దాదాపు రూ.3.24 లక్షలు ఫైన్ విధించారు.

ఇందర్జీత్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. గ్రాసరి స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ముక్కర్పై దాడికి పాల్పడి అతడికి ఊపిరాడకుండా చేశారని సిక్కు సంస్థ ఆరోపించింది. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇందర్ జిత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు