ఇరాన్‌ నుంచి ఇంధనం వద్దు

28 Jun, 2018 03:13 IST|Sakshi

దిగుమతులపై భారత్‌ సహా ప్రపంచ దేశాలకు అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్‌: ఇరాన్‌ నుంచి ముడిచమురును దిగుమతి చేసుకోవడాన్ని భారత్, చైనా సహా అన్ని దేశాలూ నవంబర్‌ 4 కల్లా పూర్తిగా నిలిపేయాలని అమెరికా హెచ్చరించింది. ఆ తర్వాత కూడా ఇరాన్‌ నుంచి ముడిచమురు పొందే దేశాలపై ఆంక్షలు విధిస్తామంది. ప్రస్తుతం ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత భారత్‌కు ముడిచమురును అత్యధిక స్థాయిలో సరఫరా చేస్తున్న దేశం ఇరానే. 2017 ఏప్రిల్‌– 2018 జనవరి  కాలంలో 1.84 కోట్ల టన్నుల ముడి చమురును ఇరాన్‌ నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంది. ఇరాన్‌ అణు పరీక్షలు జరపకుండా నిలువరించే ఒప్పందం నుంచి అమెరికా గత నెలలో వైదొలగి ఇరాన్‌పై ఆంక్షలు విధించింది.

అన్ని దేశాలూ గరిష్టంగా 180 రోజుల్లోపు ఇరాన్‌తో ముడిచమురు వ్యాపారాన్ని మానేయాలని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్‌ నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపేసేలా ప్రస్తుతం అమెరికా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. భారత్, చైనాలు ఇందుకు మినహాయింపు కాదనీ, ఇరాన్‌పై తమ ఆంక్షలకు వ్యతిరేకంగా వ్యాపారాలు జరిపితే భారత్, చైనాల్లోని కంపెనీలపై  చర్యలు తీసుకుంటామని అమెరికా తెలిపింది. ఇతర దేశాలు ఇరాన్‌ నుంచి ముడిచమురు కొనకుండా చూడటాన్ని తాము అత్యంత ప్రధాన జాతీయ భద్రతాంశంగా పరిగణిస్తున్నామన్నారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను ఇరకాటంలోకి నెట్టి, ఆ దేశ దుష్ప్రవర్తనను ఆ ప్రాంతంలోని వారికి తెలియజేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

మరిన్ని వార్తలు