మసూద్‌పై భారత్‌కు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల బాసట

28 Feb, 2019 08:18 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి : పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి ఘటనలో ప్రమేయమున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. కాగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్‌పై చైనా ప్రతికూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

బ్రిటన్‌,అమెరికా, ఫ్రాన్స్‌ల తాజా వైఖరిపై చైనా ఇంకా స్పందించలేదు. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్‌ చేయాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్‌ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. కాగా ఏకాభిప్రాయంపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఈ ప్రతిపాదనపై మార్చి 13లోగా సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తవచ్చు.

గతంలో 2017లో మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని భద్రతా మండలి కమిటీ ఎదుల ప్రతిపాదన వచ్చిన క్రమంలో ఉగ్రవాదిగా ఓ సంస్థ లేదా వ్యక్తిని నిర్వచించేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయని, ఈ నిబంధనలను సంబంధిత ఐరాస కమిటీ క్షుణ్ణంగా పరిశీలించాలంటూ ఈ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డింది.

మరిన్ని వార్తలు