భారత్‌లో ఇలాంటి ఘటనలు విచారకరం: అమెరికా

22 Oct, 2019 11:58 IST|Sakshi

వాషింగ్టన్‌ : పలు అంశాల్లో భారత్‌ తమ భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉందని.. అయితే అక్కడ మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం వారి హక్కులను పరిరక్షించాలని అమెరికా సూచించింది. ఇటీవల కాలంలో మైనార్టీలు, దళితులపై మూక దాడులు జరుగుతున్నాయని.. ఇవి భారత న్యాయ చట్టాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు.. ‘హ్యూమన్‌ రైట్స్‌ ఇన్‌ సౌత్‌ ఏషియా: వ్యూస్‌ ఫ్రం ది స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అండ్‌ రీజియన్‌’  అనే అంశంపై కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ భారత్‌లో మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. గో రక్షకుల పేరిట దళితులు, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న యాంటీ కన్వెర్షన్‌ చట్టాలు(మత మార్పిడి నిరోధక చట్టాలు) భారత్‌లో మైనార్టీలకై చట్టం కల్పిస్తున్న హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయి. భారత్‌లో ఉన్న బలహీన వర్గాలు మత స్వేచ్చ హక్కును పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి అని విఙ్ఞప్తి చేస్తున్నాం. అసోంలోని దాదాపు 1.9 మిలియన్ల ప్రజల పౌరసత్వ విషయం ప్రశ్నార్థకం అయింది. ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం. ఇందులో జవాబుదారీతనం లోపిస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు.

ఇక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో 68 శాతం మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్స్‌ అన్నారు. వీరంతా కుల, మత, వర్గ, సామాజిక, ఆర్థిక, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించారని.. ముఖ్యంగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందున్నారని తెలిపారు. భారత్‌లోని మూడో వంతు జనాభా పేదరికానికి దిగువన నివసిస్తున్నారని... ఆర్థిక అసమానతలు అధిగమించడానికి రాష్ట్రాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘ హిందూయిజం, సిక్కిం, బుద్ధిజం, జైనిజం వంటి ప్రపంచలోని నాలుగు ప్రధాన మతాలు భారత్‌లో ఉద్భవించాయి. ప్రపంచంలోని మూడో వంతు ముస్లిం జనాభాకు భారత్‌ జన్మస్థానం. ఇందులో సూఫీలు, షియాలు, బోహ్రాలు ఉన్నారు. దాదాపు మూడు వంతుల మంది క్రిస్టియన్లు కూడా భారత పౌరుల్లో ఉన్నారు. భారత్‌లోని 29 రాష్ట్రాల్లోనూ వీరి జనాభా ఉంది. అయితే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్‌లో మైనార్టీలపై దాడులు జరగడం విచారకరం’ అని వెల్స్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు