అమెరికా వీసాలు: పాక్ తోక కట్, భారత్ హ్యాపీ

29 May, 2017 17:40 IST|Sakshi
అమెరికా వీసాలు: పాక్ తోక కట్, భారత్ హ్యాపీ

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జారీచేసిన వీసాలలో పాకిస్తాన్‌కు ఏకంగా 40 శాతం కోత పెట్టారు. భారతీయులకు మాత్రం నాన్ ఇమ్మిగ్రెంట్ అమెరికా వీసాలు గత సంవత్సరంతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. ఈ విషయం అమెరికా అధికారికంగా విడుదల చేసిన సమాచారంలో ఉంది. 2016 నాటి మార్చి-ఏప్రిల్‌లో విడుదల చేసిన వీసాల కంటే పాకిస్తాన్‌కు 40 శాతం తగ్గిపోవడం గమనార్హం. ఒబామా యంత్రాంగం గత సంవత్సరం నెలకు సుమారు 6,553 వీసాలు మంజూరు చేయగా, ట్రంప్ సర్కారు మాత్రం 3,925 వీసాలే ఇచ్చింది.

ఈ సంవత్సరం మార్చికి ముందు అమెరికా విదేశాంగ శాఖ నెలవారీ జారీచేసిన వీసాల సంఖ్య వెల్లడించేది కాదు. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే చెప్పేది. దాని సగటును బట్టి చూస్తే తాజా వివరాలు వెల్లడయ్యాయి. వీసాల డిమాండు ఏడాది పొడవునా ఒకే మాదిరిగా ఉండబోదని, అది మారుతూ ఉంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. వేసవి సెలవుల్లోను, శీతాకాలం సెలవుల్లోను వీసాల సంఖ్య బాగా పెరుగుతుందని, అలాగే దేశాన్ని బట్టి కూడా మారుతుంటాయని చెప్పారు.

గత సంవత్సరం భారత దేశానికి ప్రతినెలా సగటున 72,082 వీసాలు మంజూరు కాగా ఈసారి మాత్రం మార్చిలో 97,925 వీసాలు, ఏప్రిల్‌ నెలలో 87,049 వీసాలు వచ్చాయి. పాకిస్తాన్‌ సహా సుమారు 50 ముస్లిం దేశాలకు వీసాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 20 నుంచి 40 శాతం వరకు తగ్గిందని చెబుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇరాన్, సిరియా, సూడన్, సోమాలియా, లిబియా, యెమెన్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. దాంతో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు 55 శాతం తగ్గిపోయాయి.

మరిన్ని వార్తలు