రేపిస్టును బాత్రూంలో బంధించి..

29 Mar, 2017 12:58 IST|Sakshi
రేపిస్టును బాత్రూంలో బంధించి..

మహిళలు తిరగబడితే ఎంతటి మగవాడైనా తోక ముడవాల్సిందే. అమెరికాలో సరిగ్గా ఇలాగే జరిగింది. పబ్లిక్ బాత్రూంలోకి వెళ్లిన ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని.. ఆమె గట్టిగా ఎదిరించి, అతడినే బాత్రూంలో బంధించి పోలీసులకు అప్పగించింది. అందుకోసం అంతకుముందు తమ ఆఫీసులో నిర్వహించిన ఆత్మరక్షణ తరగతుల్లో చెప్పిన అస్త్రాన్ని ఉపయోగించింది. 'ఈరోజు కాదు' అని గట్టిగా అరిచి అతడిని అయోమయంలో పడేసి ఆపై అతడిమీద విరుచుకుపడింది. ఆమె పేరు కెల్లీ హెర్రన్ (36). గట్టిగా అరిచి ఆపై తిరగబడాలి అని క్లాసులో చెప్పిన టెక్నిక్‌ను యథాతథంగా అమలుచేసింది. దాంతో దుండగుడు బిత్తరపోయి ఒక్క క్షణం ఆగేసరికి అతడి ముఖం మీద గట్టిగా ఒకటిచ్చి, బాత్రూంలో అతడిని బంధించి, పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్లొచ్చి అతడికి అరదండాలు తగిలించి తీసుకెళ్లిపోయారు.

తాను ధైర్యంగా ఎదుర్కోవడమే కాక.. మహిళలందరికీ కూడా ఈ ఆత్మరక్షణ పద్ధతులను వివరించడం మొదలుపెట్టింది కెల్లీ హెర్రన్. ఆమె ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఈ పద్ధతుల గురించిన కోర్సుల కోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసేవాళ్ల సంఖ్య పదింతలు అయ్యింది. ఆత్మరక్షణ కోర్సులో భాగంగా మహిళలను ముందు మానసికంగా దృఢంగా మార్చడంతో పాటు వాళ్లకు కరాటే, కిక్‌ బాక్సింగ్ లాంటి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పుతున్నారు. ఒక్కో క్లాసులో సుమారు 200 మంది వరకు మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. ముందుగా అందరూ 'నో' అని, తర్వాత 'నాట్ టుడే' అని అరుస్తున్నారు. ఆ తర్వాత.. అవతలివాళ్లపై పిడికిళ్లతో దాడి చేయడం ఎలాగో నేర్చుకుంటున్నారు. ఆ తరగతులన్నింటికీ కనీసం ఒక్కరోజైనా హెర్రన్ తప్పనిసరిగా వెళ్తోంది. తనపై జరిగిన దాడిని ప్రస్తావించి, ఎలా ఎదుర్కొన్నానో వివరిస్తుంటే అక్కడున్నవాళ్లు అంతా చప్పట్ల మోత మోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు