-

నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్లిపోయింది!

13 Mar, 2016 17:50 IST|Sakshi
నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్లిపోయింది!

లాస్‌ ఏంజిల్స్‌: కొందరు పిల్లలు మంకుపట్టు పడతారు. పెద్దల మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తారు. అంతమాత్రాన అమ్మ ఎప్పుడైనా వారిని వదిలించుకోవాలని అనుకుంటుందా? ఆ మొండిఘటాలను బుజ్జగించి, లాలించి, అడిగింది కొనిస్తానని ఆశపెట్టి తన దారిలోకి తెచ్చుకుంటుంది మాతృమూర్తి. పిల్లలు ఎంతమొండి వాళ్లైనా.. వాళ్లను భరించలేక ఏ కన్నతల్లి వదిలించుకోవాలని అనుకోదు. కానీ అమెరికాలోని ఓ తల్లి మాత్రం తన ఎనిమిదేళ్ల కొడుకును నిర్దాక్షిణ్యంగా ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయింది. పిల్లాడు చెప్పినట్టు వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నాడని, అతను ఎంతమాత్రం తనకు వద్దని ఓ లేఖ రాసి మరీ ఆ చిన్నారిని వదిలించుకుంది. గత ఫిబ్రవరిలో ఉటాలోని వెస్ట్ జోర్డన్‌లో ఉన్న జోర్డన్ వ్యాలీ మెడికల్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగింది.

చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలించుకున్న ఆ తల్లి ఇప్పుడు కోర్టు ఎదుర్కొంటున్నది. బాలలను వదిలించుకోవడం, బాలలను వేధించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నది. కొడుకు బ్యాగు నిండా అతని దుస్తులు సర్ది.. దాంతోపాటు ఓ లేఖ ఇచ్చి అతన్ని ఆస్పత్రి వద్ద వదిలేసి ఆమె వెళ్లిపోయింది. 'ఈ పిల్లాడు చాలా మొరటువాడు. చెప్పినమాట వినడు. మా ఇంట్లో ఇతను ఎంతమాత్రం ఉండరాదు. నేను చెడ్డ తల్లిని కాను. కానీ ఎంతో భావోద్వేగం తర్వాతే ఇలా చేశాను' అంటూ ఈ లేఖలో పేర్కొంది.

ఈ కేసులో సాల్ట్ లేక్ సిటీ డిస్ట్రిక్ట్ అటార్నీ సిమ్‌ గిల్‌ తాజాగా వాదనలు వినిపించారు. పిల్లల్ని సంబాళించడానికి తల్లిదండ్రులకు ఎన్నో మార్గాలు ఉంటాయని, కానీ ఆమె ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదని కోర్టుకు విన్నవించారు. తమను తాము కాపాడుకోలేని చిన్నారులను నిర్లక్ష్యంగా వదిలించుకోవడం, వదిలేసి వెళ్లిపోవడం బాలల వేధింపుల కిందకే వస్తుందని ఆయన కోర్టుకు నివేదించారు. బాధిత బాలుడు కూడా తనను తల్లి స్పూన్‌తో కొట్టిందని, దీంతో చెంపపై గాయం కూడా అయిందని వివరించాడు.

మరిన్ని వార్తలు