అలా కరోనా వైరస్‌ను జయించాను!

12 Mar, 2020 12:44 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) అగ్రరాజ్యం అమెరికాను కూడా వణికిస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా అనుమానితులు బయటపడగా.. పదుల సంఖ్యలో అక్కడ కరోనా మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఓ మహిళ తాను కరోనాను జయించిన తీరు గురించి పంచుకున్నారు. ‘భయపడవద్దు... వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోండి. జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రాణాంతక వైరస్‌ను సులువుగా జయించవచ్చు’ అని ధైర్యం నింపారు. వివరాలు... సీటెల్‌కు చెందిన ఎలిజబెత్‌ స్కెదర్‌(37) ఓ బయోటెక్నాలజీ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పార్టీకి వెళ్లి వచ్చిన అనంతరం ఫిబ్రవరి 25న ఆమెలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.(‘కరోనా’పై ట్రంప్‌ కీలక నిర్ణయం)

ఈ విషయం గురించి ఎలిజబెత్‌ చెబుతూ.. ‘‘ఆరోజు నిద్ర లేవగానే అలసటగా అనిపించింది. అయితే బిజీ లైఫ్‌లో ఇదంతా సహజమే కదా అనుకున్నాను. ఆఫీసుకు బయల్దేరాను. కానీ ఆ తర్వాత మెల్లగా తలనొప్పి మొదలైంది. దగ్గు మొదలైంది. ఒక్కసారిగా జ్వరం వచ్చింది. క్రమంగా 103 డిగ్రీలకు పెరిగింది. అప్పుడు నాకు కాస్త భయం వేసింది. ఫ్లూ భయం పట్టుకుంది. వెంటనే ఎమర్జెన్సీ రూంకు తీసుకువెళ్లారు. కొన్నాళ్ల తర్వాత దగ్గు, జ్వరం తగ్గిపోయింది. కాబట్టి నాకు కరోనా సోకే అవకాశమే లేదని అనుకున్నాను. అయితే ఎందుకైనా మంచిదే కదా అని డాక్టర్‌ను సంప్రదించాను. నాకు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్లమన్నారు. విశ్రాంతి తీసుకుంటూ.. ఫ్లూయిడ్స్‌ తీసుకోమని చెప్పారు. (కోవిడ్‌ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్‌ఓ)

ఆ తర్వాత కొన్నిరోజుల తర్వాత నేను కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. ఆ తర్వాత మందులు వాడుతూ వర్క్‌ ఫ్రం హోం చేశాను. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాను. బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం మానేశాను. ఈ క్రమంలో 72 గంటల్లోనే కరోనా బలహీనపడటం మొదలుపెట్టింది. అలా కొన్నిరోజుల్లోనే కరోనాను జయించాను. కాబట్టి కరోనా గురించి ఎవరూ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేను చెప్పేది ఒకటే భయపడవద్దు. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఉండండి. నీళ్లు ఎక్కువగా తాగండి. డాక్టర్ల సలహాలు తీసుకోండి. విశ్రాంతి తీసుకుంటూ మీకు నచ్చిన షోలు చూస్తూ ఎంజాయ్‌ చేయండి. ప్రశాంతంగా ఉండండి’’అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు