కోవిడ్‌ ఒక మహా విపత్తు

13 Apr, 2020 04:13 IST|Sakshi
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌

ఇటలీని మించిపోయిన అమెరికా

మృతులు, కేసులు అగ్రరాజ్యంలోనే అధికం 

50 రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితి అమలు

వాషింగ్టన్‌/లండన్‌/రోమ్‌: కోవిడ్‌ రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. ఈ వైరస్‌ ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ తీవ్రరూపం దాలుస్తోంది. కోవిడ్‌ కేసులు, మృతుల సంఖ్యలో అమెరికా అన్ని దేశాలను దాటేసి పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్‌ మృతులు ఇటలీని మించిపోయి 20 వేలు దాటిపోవడంతో అమెరికా ప్రభుత్వం మహా విపత్తుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకారంతో వ్యోమింగ్‌ రాష్ట్రాన్ని కూడా కోవిడ్‌ విపత్తు పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితులు విధించినట్టయింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

కోవిడ్‌ను మహా విపత్తుగా గుర్తించడం వల్ల వైరస్‌ ముప్పు ఉన్నంతకాలం అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వ నిధులను అన్ని రాష్ట్రాలూ, స్థానిక ప్రభుత్వాలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విపత్తును ఎదుర్కొనేం దుకు నేరుగా వైట్‌ హౌస్‌ నిధులు అన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుంది. అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్‌ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. కోవిడ్‌ ప్రభావం అత్యధికంగా న్యూయార్క్, న్యూజెర్సీలపై ఉంటే, ఇప్పుడిప్పుడే షికాగో వంటి రాష్ట్రాలకూ వ్యాధి విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కూడా 5 లక్షల 50 వేలకు చేరుకుంది. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి అధ్యక్షుడు ట్రంప్‌ 50 వేల మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు.  

60 వేల మంది మరణిస్తారని అంచనాలు
కోవిడ్‌ మహమ్మారితో అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షల మంది మరణిస్తారని తొలి దశలో అంచనా వేశారు. కానీ దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉండడం, 95 శాతానికి పైగా ఇళ్లు వదిలి బయటకు రాకుండా అత్యంత కఠినంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉండడంతో మృతుల సంఖ్య ఆ స్థాయిలో ఉండదని కోవిడ్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ భావిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడే సమయానికి మృతుల సంఖ్య 60 వేలు దాటకపోవచ్చునని టాస్క్‌ ఫోర్స్‌ సభ్యులు అంచనా వేశారు.     

అమెరికాకు చేరుకున్న క్లోరోక్విన్‌ మాత్రలు
కరోనా వైరస్‌ను నిరోధించడంలో అత్యంత కీలకంగా భావిస్తున్న మలేరియా వ్యాధికి వాడే క్లోరోక్విన్‌ మాత్రలు భారత్‌ నుంచి అమెరికాకు చేరుకున్నాయి.  అమెరికా కోరినట్టుగా 35.82 లక్షల మాత్రలతో పాటు ఇతర ఔషధాల తయారీలో వినియోగించే ముడిపదార్థం 9 మెట్రిక్‌ టన్నుల్ని ప్రత్యేక కార్గో విమానంలో అమెరికాకు పంపింది. అవన్నీ శనివారం న్యూజెర్సీలో నేవార్క్‌ విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.  

► సింగపూర్‌లో సంపూర్ణంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ 24 గంటల్లో 191 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 51 మంది భారతీయులు ఉన్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.  
► యూకేలో మృతులు 10 వేలు దాటేశాయి. ఒకే రోజు 657 మంది మృతి చెందడం ఆందోళన పెంచుతోంది.  
► యూరప్‌ దేశాల్లో మృతుల సంఖ్య 75 వేలు దాటింది. స్పెయిన్‌లో ఆదివారం 610 మంది ప్రాణాలు కోల్పోయారు.
► చైనాలో మళ్లీ కరోనా కలవరం రేపుతోంది. మరో 100 కేసులు నమోదయ్యాయి.  
► ప్రపంచ దేశాలన్నీ మరికొన్ని రోజులు  లాక్‌డౌన్‌ పాటించాలని, లేదంటే రెండో విడత వైరస్‌ విజృంభించే అవకాశాలున్నాయని  ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు హెచ్చరించింది.

ఆస్పత్రి నుంచి బోరిస్‌ జాన్సన్‌ డిశ్చార్జి  
బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ కోవిడ్‌ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆరోగ్యం బాగుపడడంతో లండన్‌లో సెయింట్‌ థామస్‌ నుంచి ఆయనను డిశ్చార్చి చేశారు. వైద్య సిబ్బంది తన ప్రాణాలు కాపాడారని, వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉంటానని ఇంటికి వెళ్లే సమయంలో జాన్సన్‌ పేరు పేరునా ఆస్పత్రిలో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారని, ఆయన విధులకు హాజరుకావడానికి మరి కొద్ది రోజుల సమయం పడుతుందని బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్‌ రాబ్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు