12 మంది మృతి.. అట్టుడుకుతున్న ఇరాన్‌

1 Jan, 2018 15:53 IST|Sakshi

టెహ్రాన్‌ : ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలంటూ ఆందోళనకారులు రోడ్డెక్కగా.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పటంతో పోలీసులు కాల్పులకు దిగారు. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో 12 మంది పౌరులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. 

ఇజే పట్టణంలో శనివారం పోలీస్‌ కాల్పుల్లో ఇద్దరు చనిపోయినట్లు ఎంపీ హదయాతుల్లా ఖదెమి వెల్లడించారు. కాగా, 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు ఇరాన్‌లో పెద్ద ఎత్తున్న అల్లర్లు చెలరేగుతున్నాయి.  ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తూ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ప్రతిపక్షాలు.. ప్రభుత్వం గద్దెదిగి పోవాలంటూ నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా.. సోషల్‌మీడియాలో అది విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో నిరసనలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన వస్తోంది. 

ఆదివారం రాత్రి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఇరాన్‌ అధ్యక్షుడు హస్సన్‌ రౌహానీ ఆపై మీడియాతో మాట్లాడారు.  నిరసనలు తెలపటం తప్పు కాదని.. అలాగని శాంతి భద్రతలకు భంగం కలిగించటం, ప్రభుత్వ- ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం‍ చూస్తూ సహించే ప్రసక్తే లేదని రౌహానీ ఆందోళనకారులను హెచ్చరించాడు.

అమెరికా హెచ్చరిక

ఇక ఇరాన్‌ లో నెలకొన్న ప్రతిష్టంభనపై అమెరికా స్పందించింది. పరిణామాలు చక్కబెట్టుకోకపోతే అంతర్జాతీయ సమాజం తరపున తాము రంగంలోకి దిగాల్సి ఉంటుందని యూఎస్‌ రక్షణ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇక ఆందోళనకారులకు మద్దతుగా ట్రంప్‌ కూడా ఈమేరకు ట్వీట్‌ కూడా చేశారు. ప్రపంచం మిమిల్ని గమనిస్తోంది.. ప్రజలకు శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు