అమెరికా దాడుల్లో అల్‌ ఖైదా బడావీ మృతి

8 Jan, 2019 09:59 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా ముఖ్యనాయకుడు జమాల్‌ అల్‌ బడావీ అమెరికా వాయుసేన దాడుల్లో మరణించినట్లు ఆ దేశం వెల్లడించింది. అల్‌ఖైదా తరఫున యెమెన్‌లో కార్యకలాపాలు నిర్వహించే బడావీ.. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బందిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కీలకపాత్ర పోషించాడు. ఈ దాడిలో 17 మంది మృత్యువాతపడగా.. 40 మంది గాయాలపాలయ్యారు. బడావీ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది.

ఈ ఘటనపై అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి బిల్‌ అర్బన్‌ మాట్లాడుతూ.. జనవరి 1వ తేదీన మారిబ్‌ గవర్నేట్‌లో అమెరికా వాయు దళాలు జరిపిన దాడుల్లో జమాల్‌ అల్‌ బడావీ మృతిచెందినట్లు తెలిపారు. బడావిని హత్యచేసిన అమెరికా మిలటరీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందించారు. ‘ఆత్మాహుతి దాడి సూత్రదారి జమాల్‌ అల్‌ బడావీని మేము ఇప్పుడే చంపాం. అల్‌ఖైదాకు వ్యతిరేకంగా మా పని కొనసాగిస్తాం. ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మా పోరాటాన్ని ఎప్పటికీ ఆపబోం’అని ట్రంప్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు