‘వాలంటైన్స్‌ డే’  వేడుకలు నిషేధం

13 Feb, 2020 19:38 IST|Sakshi

ఇండోనేసియాలోని బాండా ఆచ్చే నగరంలో ‘వాలంటైన్స్‌ డే’ వేడుకులను శుక్రవారం నాడు నిషేధించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఆ నగరంలో ఈ వేడుకలను నిర్వహించడం ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధమంటూ నగర మేయర్‌ అమీనుల్లా ఉస్మాన్‌ ఉత్తర్వులు జారీ చే శారు. హోటళ్లలో, రెస్టారెంట్స్‌లో, మరే ఇతర వేదికలపై వాలంటైన్స్‌ డేను పురస్కరించుకొని ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ఇలాంటి వేడుకలకు యువతీ యువకులు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.  

ఇండోనేసియాలోని సుమత్ర దీవుల్లో ఉన్న ఈ బాండా ఆచ్చే నగరం ఆచ్చే రాష్ట్ర రాజధాని. షరియా చట్టాన్ని అమలు చేస్తున్న ఏకైక ముస్లిం మెజారిటీ రాష్ట్రం ఇండోనేసియాలో ఇదొక్కటే. ఆ రాష్ట్రంలో వివాహేతర సంబంధాలను, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను, జూదాన్ని, గే సంస్కృతిని నిషేధించారు. ఇండోనేసియాలో జనాభా రీత్యా ముస్లింలు ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడి కేంద్ర ప్రభుత్వం ఇస్లాంతోపాటు క్రైస్తవం, హిందూ, బౌద్ధం, ప్రొటెస్టంటనిజం, కన్ఫ్యూజనిజం మతాలను అధికారికంగా గుర్తించింది. 

>
మరిన్ని వార్తలు