మే 16 నుంచి 22 వరకు

13 May, 2020 02:23 IST|Sakshi
షికాగో నుంచి భారత్‌కు బయల్దేరిన విమానం

వందేభారత్‌ రెండోదశకు సన్నాహాలు

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు రెండో దశ వందేభారత్‌ మిషన్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా మే 16 నుంచి 22 వరకు, 31 దేశాలకు 149 విమానాలను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. రెండోదశలో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఖతార్, ఇండోనేసియా, ఉక్రెయిన్, కజికిస్తాన్, ఒమన్, మలేసియా, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, సింగపూర్, ఐర్లాండ్, కిర్గిజిస్థాన్, కువైట్, జపాన్, జార్జియా, జర్మనీ, తజకిస్తాన్, బహ్రెయిన్, అర్మేనియా, థాయ్‌లాండ్, ఇటలీ, నేపాల్, బెలారస్, నైజీరియా, బంగ్లాదేశ్‌లకు 149 విమానాలను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విమానాల్లో కేరళకి 31, ఢిల్లీ 22, కర్ణాటక 17, తెలంగాణ 16, గుజరాత్‌ 14, రాజస్తాన్‌ 12, ఆంధ్రప్రదేశ్‌ 9, పంజాబ్‌లో 7 విమానాలు ల్యాండ్‌ అవుతాయి. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో 6, ఒడిశాలో 3, చండీగఢ్‌లో 2, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లకు ఒక్కో విమానం చొప్పున చేరతాయి.

కొందరు ప్రవాసులకు కష్టాలు!
కరోనా కష్టాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం రప్పించేందుకు చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ అమెరికాలో కొంతమందికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా కారణంగా విదేశీయుల వీసాలతోపాటు, భారతీయ సంతతి పౌరులు వీసాల అవసరం లేకుండా భారత్‌కు వచ్చేందుకు అవకాశం కల్పించే ఓసీఐ కార్డులనూ తాత్కాలికంగా రద్దు చేయడం ఇందుకు కారణమవుతోంది. దీంతో హెచ్‌1బీ వీసాలు ఉన్న వారు లేదా గ్రీన్‌కార్డు కలిగి ఉన్నవారు, పుట్టుకతో అమెరికా పౌరులైన పిల్లల తల్లిదండ్రులు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేకుండాపోయింది.

హెచ్‌1బీ వీసాలు ఉన్న వారిలో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి.. ఇటు స్వదేశమూ రాలేక నానా అవస్థలూ పడుతున్నారు. అమెరికా ప్రభుత్వం నిర్ణయం కారణంగా వీరందరూ రెండు నెలల్లో భారత్‌కు వెళ్లిపోవాల్సి ఉంది. తల్లిదండ్రులకు భారతీయ వీసా ఉన్నప్పటికీ పిల్లలు అమెరిక పౌరులైనందున వారిని వందేభారత్‌ మిషన్‌లో భాగంగా భారత్‌ తిరిగి తీసుకువచ్చేందుకు ఎయిరిండియా అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు తమను అనుమతించాలని కోరుతూ అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు