వెనిజువెలా అధ్యక్షుడిపై హత్యాయత్నం!

6 Aug, 2018 04:03 IST|Sakshi
పేలుడు తర్వాత మడురోకు రక్షణగా నిలబడిన భద్రతా సిబ్బంది. (ఇన్‌సెట్‌లో) మడురో

ఏడుగురు సైనికులకు గాయాలు

ప్రెసిడెంట్‌ నికోలస్‌ మడురో క్షేమం

దాడికి బాధ్యత ప్రకటించుకున్న రెబల్‌ మిలటరీ గ్రూప్‌

తమకేం సంబంధం లేదని అమెరికా స్పష్టీకరణ  

కరాకస్‌: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మడురోపై ఆదివారం ఉదయం (భారతకాలమానం ప్రకారం) హత్యాయత్నం జరిగింది. భారీ పేలుడు పదార్థాలున్న డ్రోన్‌ ఆయన ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో పేలింది. ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగానే బయటబడినా.. ఏడుగురు సైనికులకు గాయాలయ్యాయి. నేషనల్‌ గార్డ్స్‌ 81వ వార్షికోత్సవం సందర్భంగా కరాకస్‌లో మిలటరీ పరేడ్‌నుద్దేశించి మడురో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి కొలంబియానే కారణమని మొదట పేర్కొన్న మడురో అనంతరం.. అనుమానాస్పద రెబల్‌ గ్రూప్‌ హత్యాయత్నం చేసి ఉండొచ్చన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మిలటరీ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘నేను బాగున్నాను. బతికే ఉన్నాను.

ఈ దాడి తర్వాత మరింత విప్లవాత్మకంగా పనిచేయాలని నిశ్చయించుకున్నాను. ఈ ఘటనకు బాధ్యులకు తీవ్రమైన శిక్షలు తప్పవు. ఎవరినీ క్షమించబోం’ అని దాడి అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ మడురో హెచ్చరించారు. ‘నన్ను చంపేందుకు పన్నిన కుట్ర ఇది. నేడు నన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. ఓ ఎగురుతున్న వస్తువు హఠాత్తుగా నా ముందు పేలింది’ అని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలను అణచివేస్తున్న మడురో.. 248 మందిని రాజకీయ ఖైదీలుగా జైల్లో పెట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై కనికరం చూపించబోమని అటార్నీ జనరల్‌ తారెక్‌ విలియమ్‌ సాబ్‌ హెచ్చరించారు. కాగా, ఈ దాడికి తమదే బాధ్యతని వెనిజువెలా మిలటరీ రెబల్‌ గ్రూప్‌ ‘నేషనల్‌ మూమెంట్‌ ఆఫ్‌ సోల్జర్స్‌ ఇన్‌ టీషర్ట్స్‌’ (ఎన్‌ఎంఎస్‌టీ) ప్రకటించుకుంది.  

పేలింది డ్రోనా? సిలిండరా?
వెనిజువెలా అధికార చానెల్‌లో చూపించిన దృశ్యాల్లో.. సైనికుల మధ్యలో మడురో నిలబడి ప్రసంగిస్తుండగా ఓ భారీ శబ్దం వినిపించింది. దీంతో పరేడ్‌లో ఉన్న జాతీయ గార్డులు దూరంగా జరిగిపోయారు. పేలుడు జరగగానే గార్డులు అధ్యక్షుడికి రక్షణ కల్పిస్తూ ఆయన చుట్టూ వలయంలా మారిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఆ వెంటనే లైవ్‌ కట్‌ అయింది. అధ్యక్షుడు ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో ఈ డ్రోన్‌ పేలిందని వెనిజువెలా సమాచార మంత్రి జార్జ్‌ రోడ్రిగ్జ్‌ తెలిపారు. సంప్రదాయవాదులే (విపక్షం) ఈ పనిచేసి ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కరాకస్‌ మిలటరీ క్షేత్రానికి సమీపంలోని భవనం వద్దనుంచే ఈ డ్రోన్‌ను ఆపరేట్‌ చేసినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు. అయితే.. సమీపంలోని భవనంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే భారీగా శబ్దం వచ్చిందని, హత్యాయత్నం జరగలేదని పలు అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నా యి. మడురో మిత్రులైన క్యూబా, బొలీవియా దేశాలు ఈ హత్యాయత్నాన్ని ఖండించాయి.

మాకేం సంబంధం లేదు: అమెరికా
వెనిజువెలా ఘటనను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడి వెనక తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ‘అమెరికా ప్రమేయం లేదు. ఆ దేశంలో జరిగే మార్పులతో మాకు సంబంధం లేదు’ అని అమెరికా భద్రతా సలహాదారు. జాన్‌ బోల్టన్‌ తెలిపారు. కొలంబియా ప్రభుత్వం కూడా మడురో ఆరోపణలను ఖండించింది. ‘మడురో ఆరోపణలు అర్థరహితం. ఎలాంటి ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు’ అని హెచ్చరించింది.

బాధ్యత మాదే!
ఈ దాడికి తామే బాధ్యులమని మిలటరీ రెబల్‌ గ్రూప్‌ ‘నేషనల్‌ మూమెంట్‌ ఆఫ్‌ సోల్జర్స్‌ ఇన్‌ టీషర్ట్స్‌’ (ఎన్‌ఎంఎస్‌టీ) ప్రకటించుకుంది. ‘రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వారు, అధికారాన్ని స్వార్థప్రయోజనాలకు వాడుకునే వారికి మిలటరీ ఇస్తున్న అసలు సిసలు గౌరవం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘దేశ ప్రజలు సంతోషంగా ఉండేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోలేని ప్రభుత్వాన్ని మేం సహించబోం. కరెన్సీకి విలువ లేదు. వ్యాధులకు మందుల్లేవు. విద్యావ్యవస్థ దారుణంగా ఉంది. కమ్యూనిజాన్ని మాత్రమే ప్రభుత్వం బోధిస్తోంది’ అని ఎన్‌ఎంఎస్‌టీ పేర్కొంది.  

దేశంలో రాజ్యాంగ సంక్షోభం
భారీ చమురు నిక్షేపాలున్నప్పటికీ.. వెనిజువెలా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దేశంలో కొంతకాలంగా రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. మడురో సన్నిహితులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థితికి చేరుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సంప్రదాయవాదులను (విపక్షాలు) మడురో జైల్లో పెట్టిస్తున్నారు. వీరికి అమెరికా సాయం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగగా.. మడురో ఏకపక్ష నిర్ణయాలతో విపక్షం ఎన్నికలను బహిష్కరించింది. దీంతో మరో ఆరేళ్లపాటు ఈయనే అధికారంలో ఉండనున్నారు.  

డ్రైవర్‌ నుంచి అధ్యక్షుడి దాకా..
1962లో పుట్టిన నికోలస్‌ మడురో తండ్రి వెనిజువెలాలో ప్రముఖ కార్మిక నేత. చిన్నప్పటినుంచే కమ్యూనిజం, కార్మిక చట్టాలను మడురో ఒంటబట్టించుకున్నారు. విద్యార్థి సంఘం నేతగా ఎదిగిన మడురో గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తిచేయలేదు. అనంతరం కరాకస్‌ మెట్రో కంపెనీలో బస్‌ డ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1993లో అప్పటి వెనిజువెలా అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ను కలుసుకున్న మడురో.. ఆ తర్వాత బొలివియన్‌ ఉద్యమంతో కీలకనేతగా ఎదిగారు. ఈ ఉద్యమం ద్వారానే 1998లో చావెజ్‌ అధ్యక్ష పీఠాన్ని మళ్లీ అధిరోహించారు. అప్పుడే మడురో ఎంపీగా గెలిచారు. 1999లో నేషనల్‌ అసెంబ్లీలో డిప్యూటీ నేతగా ఎంపికయ్యారు. చావెజ్‌ 2006లో మడురోను విదేశాంగ మంత్రిగా నియమించారు. 2013లో చావెజ్‌ మరణంతో ఆపద్ధర్మ నేతగా, ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో నెగ్గి అధ్యక్షుడయ్యారు.

మరిన్ని వార్తలు