రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

18 Jul, 2019 18:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు చమురు ఎగుమతులతో సమద్ధిగా ఎదిగిన దేశం వెనిజులాలో నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు నిత్యం ఆందోళనలు చేయడం, వారిని పోలీసులు పాశవికంగా అణచివేయడం నిత్యకత్యమైంది. అలాగే వంట గ్యాస్‌ కోసం తల్లి ఆండ్రియానా వెంట కుమారులు రూఫో ఛాకన్‌ (16), ఆండ్రియాన్‌ (14)లు తారిబా పట్టణంలో రెండు వారాల క్రితం ఆందోళన చేస్తుండగా, వారిపైకి పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లు కాల్చారు. ఆ బుల్లెట్లకు సంబంధించిన 51 ముక్కలు వచ్చి రూఫో ఛాకన్‌ ముఖానికి తగులగా, వాటిల్లో 16 ముక్కలు నేరుగా రెండు కళ్లలోకి దూసుకుపోయాయి. 

దీంతో రెండు కళ్ల నుంచి రక్తం చిమ్మింది. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స అందించినప్పటికీ రెండు కళ్లు పోయాయి. చూపు తెప్పించే ఆస్కారమే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వంట గ్యాస్‌ లేక ఇబ్బంది పడుతున్న తల్లికి అండగా తాను ఆందోళనకు వెళ్లినందుకు ఇప్పుడు తల్లికి భారంగా మారాల్సి వచ్చిందని ఆ తనయుడు బాధ పడుతున్నాడు. ఇంక తానే మాత్రం ఏడ్వదల్చుకోలేదని, ఆస్పత్రిలోనే కావాల్సినంత ఏడ్చేశానని మీడియా ముందు వాపోయాడు. తాను మదిలో రంగులు మర్చిపోకముందే చూపు రావాలని కోరుకుంటున్నానని, తనకు జీవితంలో ఏ కలలు చావలేదని, చూపు కోసం తాను ఎంత కష్టపడాలన్నా పడతానని, అలాంటి దారి ఉంటే చూపుమని మీడియాను కూడా వేడుకున్నాడు. బాధ్యతారహితంగా రబ్బర్‌ బుల్లెట్లను పేల్చిన ఇద్దరు పోలీసులను వెనిజులా యంత్రాంగం గుర్తించి వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. అమెరికా ఆంక్షల వల్ల ఇప్పుడు వెనిజులాలో  చమురు, వంట గ్యాస్‌ కొరత తీవ్రమైంది. 

మరిన్ని వార్తలు