నిజమే.. నమ్మండి!

18 May, 2016 16:42 IST|Sakshi
నిజమే.. నమ్మండి!

కొన్ని ఘటనలు నమ్మశక్యంగా ఉండవు. అవి చరిత్ర, శాస్త్రవిజ్ఞానం, భూ, ఖగోళ శాస్త్రం.. ఇలా అంశమేదైనా వీటికి సంబంధించిన అనేక సంఘటనలు తెలుసుకోవడానికి వింతగా ఉంటాయి. వాటి వెనుక ఎన్నో ఆసక్తికర కథలూ ఉంటాయి. అలా కొన్ని అరుదైన సంఘటనల గురించి తెలుసుకుందాం..

ఈఫిల్ టవర్‌నే అమ్మేశాడు..
ఈ భూమ్మీదున్న అద్భుత నిర్మాణాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరంలో ఉన్న ఈఫిల్ టవర్ నిర్మాణశైలిని ఇప్పటికీ ఓ ఇంజనీరింగ్ వింతగానే అభివర్ణిస్తారు. 1889లో నిర్మితమైన ఇది నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. గత ఏడాది దీన్ని దాదాపు 70 లక్షల మంది సందర్శించి ఉంటారని అంచనా. ఇంతగా పర్యాటకులను ఆకర్షిస్తూ, ఫ్రాన్స్‌కే తలమానికంగా నిలిచిన ఈఫిల్ టవర్‌ను ఓ వ్యక్తి అమ్మేశాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. చెక్ రిపబ్లిక్‌కు చెందిన విక్టర్ లాస్టింగ్ అనే వ్యక్తి అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతుండేవాడు.

అవకాశం ఉన్న ప్రతిచోట ఏదో ఒకలా మోసానికి పాల్పడి, అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో 1925లో ఓ రోజు దినపత్రికలో ఈఫిల్ టవర్‌కు సంబంధించిన వార్త ప్రచురితమైంది. ఈఫిల్ శిథిలావస్థలో ఉందని, దాదాపు 20 ఏళ్లకు మించి అది నిలబడదని, దాని నిర్వహణ, మరమ్మతులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయనేది ఆ వార్త సారాంశం. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని ఈఫిల్ టవర్‌ను అమ్మేసేందుకు విక్టర్ ప్రణాళిక రచించాడు. పాత సామగ్రి కొనే వ్యాపారులను కలిశాడు. తాను ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగినని, ఈఫిల్ టవర్‌ను అమ్మేసే బాధ్యత ప్రభుత్వం తనకు అప్పగించిందని వారిని నమ్మించాడు. ఈఫిల్ టవర్‌ను అమ్మేస్తున్నామని, దాన్ని పడగొట్టిన తర్వాత ముడి పదార్థమైన ఇనుమును కొనుక్కోవాల్సిందిగా సూచించాడు. దీన్ని నమ్మిన ఓ సంస్థ విక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అతడికి దాదాపు 20,000 డాలర్లను కూడా ముట్టజెప్పింది. తీరా ఆ డబ్బు తీసుకుని విక్టర్ అక్కడినుంచి పారిపోయాడు. చివరకు టవర్‌ను అమ్మడం అబద్దమని తెలుసుకున్న ఆ సంస్థ మోసపోయామని గ్రహించింది. ఇలా ఓ సంస్థకు ఈఫిల్ టవర్‌నే అమ్మేసి, విక్టర్ నేరస్థుడిగా చరిత్రలో మిగిలిపోయాడు.

58 ఏళ్లైనా దొరకని అణుబాంబు..
1958 ఫిబ్రవరి 5న జార్జియాకు చెందిన ఓ యుద్ధ విమానం 7,000 పౌండ్ల బరువు కలిగిన అణుబాంబును మోసుకెళ్తోంది. అయితే విమానం ప్రమాదానికి గురయ్యే పరిస్థితి తలెత్తింది. అణుబాంబుతో కూడిన విమానం నేలను ఢీకొంటే బాంబు పేలడం ఖాయం. అణుబాంబు పేలితే జరిగే నష్టం అంచనాలకందదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ అణుబాంబును ఓ నదీ తీరంలో జారవిడిచాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి పైలట్ బయపడ్డాడు. అయితే నదిలో పడ్డ అణుబాంబును కనుగొనేందుకు నేవీ అధికారులు చాలాకాలం పాటు వెతికారు. కానీ వారికి దాని జాడ దొరకలేదు. ఇప్పటికీ ఆ బాంబు కోసం ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అణుబాంబు అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి, దాన్ని కనుక్కొని, నిర్వీర్యం చేయాలని వారి ఆలోచన. ఆ బాంబు ఎక్కడ ఉన్నా, దానికి ఎలాంటి ఇబ్బందీ, తాకిడీ లేనంత వరకు అది పేలదని అధికారుల వాదన. ఏదేమైనా 58 ఏళ్లు గడిచినా, ఇంకా ఆ బాంబు పేలకుండా, దొరకకుండా నేవీ అధికారులను కలవరపెడుతోంది.
 
చికాగో ఎత్తు పెరిగింది..
1855లో చికాగో నగరం ఎప్పుడూ బురద నీటిలోనే ఉంటూ ఉండేది. కారణం ఈ నగరం నదీ తీరానికి దగ్గరగా ఉండడంతోపాటు డ్రైనేజీ, వరద నీటి పారుదల వ్యవస్థలు కూడా సరిగ్గా ఉండేవి కావు. దీంతో ప్రజలు టైఫాయిడ్ జ్వరం, కలరా వంటి పలు వ్యాధులతో సతమతమయ్యేవారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏవీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఈ.చెస్‌బ్రో అనే ఇంజనీర్‌ను నియమించి, దీనికి పరిష్కారం కనుగొనమన్నారు. నగరానికి ఈ సమస్య తప్పాలంటే, భారీ వరద కాలువలు తవ్వాలని, ఇందుకోసం చికాగో నగరం ఎత్తు పెంచాలని అతడు సూచించాడు.

అనేక చర్చల అనంతరం దీనికి అధికారులు అంగీకరించారు. అలా నగరంలోని వీధులు, ఫుట్‌పాత్‌లు, బిల్డింగుల ఎత్తు పెంచేందుకు పూనుకున్నారు. బిల్డింగుల పునాదుల ఎత్తు పెంచడం ద్వారా అవి ఎత్తులో నిలిచాయి. ఇలా నగరంలోని చాలా చోట్ల ఎత్తు పెరిగింది. దాదాపు 4-14 అడుగుల వరకు వీలున్న చోటల్లా నగరం ఎత్తు పెంచుతూ వచ్చారు. ఫలితంగా ఉపరితలం నుంచి డ్రైనేజీలు, కాలువల ఎత్తు పెరిగింది. నది కంటే నగరం ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల నీరు పల్లానికి చేరేది. అయితే ఈ తతంగం అంతా పూర్తి కావడానికి దాదాపు రెండు దశాబ్దాలకు పైగాపట్టింది. ఈ పనులు చేసే సమయంలో సాధారణ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకున్నారు.

మరిన్ని వార్తలు