ట్రంప్ గెలిచాడు.. హిల్లరీ ఓడింది!

10 Feb, 2016 17:39 IST|Sakshi
ట్రంప్ గెలిచాడు.. హిల్లరీ ఓడింది!

డొనాల్డ్ ట్రంప్ న్యూ హ్యంప్ షైర్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడంలో మరో ముందడుగు వేశారు. త్వరలో సౌత్ కరోలినా రాష్ట్రంలో జరిగే రిపబ్లికన్ ప్రాథమిక ఎన్నికల్లోనూ తనదే విజయమని, అమెరికా అధ్యక్ష బరిలోనూ గెలిచితీరుతానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్ బెర్నీ సాండర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. న్యూ హ్యాంప్ షైర్ డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో 60శాతం ఓట్లు సాధించి.. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో బెర్నీ సాండర్స్ దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది పార్టీ ప్రతినిధులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. మరోవైపు 2008 అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో న్యూ హ్యాంప్ షైర్ లో ఒబామాపై విజయం సాధించిన హిల్లరీ క్లింటన్ ఈసారి కేవలం 30శాతం ఓట్లు మాత్రమే సాధించారు. తొమ్మిది మంది పార్టీ ప్రతినిధులు మాత్రమే ఆమెకు అండగా నిలిచారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం తనదేనని బెర్నీ సాండర్స్ ధీమా వ్యక్తం చేయగా.. మున్ముందు జరగబోయే ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి రేసులో నిలుస్తానని హిల్లరీ విశ్వాసం వ్యక్తం చేసింది.

మరోవైపు న్యూ హ్యాంప్ షైర్ లో ఘనవిజయం సాధించిన ట్రంప్ తన ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ నుంచి బెర్రీ సాండర్స్ నిలుస్తారని సంకేతాలు ఇచ్చారు. సాండర్స్ పై తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. ఆయన అమెరికా అధ్యక్షుడైతే దేశాన్ని అమ్మేస్తాడని విమర్శించారు. రిపబ్లికన్ ప్రైమరీలోనే కాదు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ తనదే విజయమని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు