‘వీడియోగేమ్‌ అడిక్షన్‌ ఓ మెంటల్‌ డిజార్డరే’

30 May, 2019 08:47 IST|Sakshi

జెనీవా: ప్రస్తుతం ఏ చిన్నారిని చూసినా మొబైల్‌ ఫోన్‌తోనే కనిపిస్తున్నారు. వీడియోగేమ్‌ల పేరిట ఆరుబయట ఆడే క్రీడలకు దూరమైపోతున్నారు. అయితే స్కూల్‌లో పాఠాలు వినడం, లేదంటే మొబైల్‌ ఫోన్‌ని పట్టుకుని కూర్చోవడం.. ఇదీ ఈ తరం చిన్నారుల లైఫ్‌స్టయిల్‌. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీడియో గేమ్‌లకు బానిసలైపోతున్న వారి మానసికస్థితి సరిగా ఉండటం లేదని డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది.

వీడియోగేమ్స్‌ కారణంగా పిల్లలు మానసిక వ్యాధులబారిన పడుతున్నారని, రోజువారి జీవితంలో ఈ వీడియోగేమ్స్‌ ప్రభావం కూడా ప్రతికూలంగా ఉంటోందని తేల్చింది. ఎక్కువ సేపు గేమ్స్‌ ఆడేవారి ఇతర ఆసక్తులను, కార్యకలాపాలను ఈ గేమ్స్‌ నిర్లక్ష్యం చేస్తున్నాయని, వీడియో గేమ్స్‌ ఆడుతూ నిద్ర, తిండి కూడా పట్టించుకోవట్లేదని వెల్లడించింది. ‘వీడియో గేమ్‌ అడిక్షన్‌’ని మెంటల్‌ డిజార్డర్‌గా డబ్ల్యూహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది.   

మరిన్ని వార్తలు